Monday, January 20, 2025
Homeసినిమారాజశేఖర్ ఏం చేస్తున్నారు? ఆయన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదే!  

రాజశేఖర్ ఏం చేస్తున్నారు? ఆయన నుంచి ఎలాంటి అప్ డేట్ లేదే!  

రాజశేఖర్ .. అనే పేరు వినగానే తెరపై పవర్ఫుల్ పోలీస్ పాత్రలు గుర్తుకు వస్తాయి. విభిన్నమైన ఇతర పాత్రలు చేసినప్పటికీ, ఆయనకి ఎక్కువగా పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది మాత్రం పోలీస్ ఆఫీసర్ పాత్రలే. ఇతర హీరోలు చాలామంది పోలీస్ పాత్రలు చేసినా, ఆ పాత్రలపై రాజశేఖర్ మార్క్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకాలం పాటు ఆయన నిలబడటానికి కారణం కూడా ఆ పోలీస్ పాత్రలే. అందుకే ఆయన ఆ పాత్రలలో కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు సొంత బ్యానర్లలో సినిమాలు చేసి, తమ స్టార్ డమ్ మరికొంత కాలం పాటు కొనసాగించే ప్రయత్నాలు చేస్తూ వెళ్లారు. రాజశేఖర్ కూడా అదే రూట్లో వెళ్లారు. సొంత బ్యానర్లో కూడా ఆయన ఎక్కువగా చేసింది పోలీస్ సినిమాలే. యాక్టింగ్ పరంగా ఆయన ఎప్పుడూ తక్కువ మార్కులు తెచ్చుకోలేదుగానీ, కథాకథనాల పరంగా ఆ సినిమాలు దెబ్బతిన్నాయి. ఆయనను ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పెట్టాయి కూడా.

ఈ నేపథ్యంలో చేసిన ‘గరుడ వేగా’ ఆయనకి  కొంతవరకూ ఊరట నిచ్చిందిగానీ, ఆ తరువాత చేసిన ‘కల్కి’ సినిమా పరాజయం మళ్లీ ఉసూరుమనిపించింది. దాంతో ఆయన మలయాళ మూవీ ‘జోసెఫ్’ హక్కులు తీసుకుని, తెలుగులో ‘శేఖర్’ టైటిల్ తో రీమేక్ చేశారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా థియేటర్లకు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది.

 ‘శేఖర్’ తో పాటే రాజశేఖర్ మూడు నాలుగు ప్రాజెక్టులు చేయనున్నట్టు ఆ మధ్య ప్రకటనలు వచ్చాయి. ఒకటి రెండు సినిమాలకి సంబంధించిన పోస్టర్లు కూడా వచ్చాయి.  కానీ వాటి గురించిన మాటేదీ ఇప్పుడు వినిపించడం లేదు. ఆయన నుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. ఆయన ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండటంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఆయన నెక్స్ట్ మూవీ ఏమిటనేది తెలుసుకోవాలనే ఆత్రుతతో ఉన్నారు. రాజశేఖర్ ఏం చెబుతారనేది చూడాలి మరి!

RELATED ARTICLES

Most Popular

న్యూస్