Monday, May 20, 2024
Homeసినిమాసినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు : సురేష్ బాబు

సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు : సురేష్ బాబు

Suresh Babu :

విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘దృశ్యం 2’. ఈ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న విడుదలైంది. సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత సురేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే..

‘దృశ్యం 2’ మళయాలంలో మంచి హిట్ అయింది. వెంటనే రైట్స్ తీసుకున్నాం. జీతూ జోసెఫ్‌ను స్క్రిప్ట్ పంపించమని అడిగాను. కొన్ని మార్పులు చేర్పులు సూచించాను. అలా మొత్తానికి స్క్రిప్ట్ పూర్తయింది. వెంటనే షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా అంత త్వరగా ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. హైదరాబాద్, కేరళలో షూట్ చేశాం. కరోనా భయంతో నేను మాత్రం సెట్‌కు వెళ్లలేదు. కానీ మా వాళ్లతో మాత్రం పని చేయించాను.

దృశ్యం 2’ అనేది కమర్షియల్  సినిమా కాదు, పాటలు, ఫైట్లు ఉండే సినిమాలను థియేటర్లో చూస్తే మంచి కిక్ వస్తుంది. ఈ సినిమా థియేటర్లో విడుదల చేసినా కూడా ఈ రేటింగ్ వచ్చేది. కానీ కలెక్షన్లు ఎంత వస్తాయనేది చెప్పలేం. ఓటీటీ అనేది ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్ వంటి వాటి వల్ల కొత్త టాలెంట్ కూడా వస్తోంది. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సినిమాను తీయగలుగుతున్నారు.

ఏపీలో టికెట్ రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, 30 అనేది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ఈ కారణాల వల్ల ‘దృశ్యం 2’ సినిమా ఓటీటీలో అయితే బాగుంటుందని అనుకున్నాం. ప్రభుత్వంతో ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ జరుగుతుందనిపిస్తుంది. మరీ అంత తక్కువ రేట్లు పెట్టడమనేది కూడా కరెక్ట్ కాదు.  ఓ ప్రొడక్ట్‌‌ ను ఎంత రేటుకు అమ్ముకోవాలనే హక్కు నిర్మాతకు కూడా ఉంటుంది. ఈ 15 నెలల్లో మాకు కేంద్రం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేసింది ఏమీ లేదు. థియేటర్ కరెంట్ బిల్లులు కూడా మాఫీ చేయలేదు. థియేటర్ల ఓనర్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్‌ పీరియన్స్ వేరు. కానీ ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది. అఖండ, పుష్ప వంటి చిత్రాలకు ఆడియెన్స్ కచ్చితంగా వస్తారు. పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైంది. అందుకే ఫెస్టివల్ సీజన్‌కు రావాలని ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు నాలుగు సినిమాలు వచ్చేవి. నాలుగు వందల థియేటర్ల చొప్పున నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్‌ కావాలని అంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది...చూడాలి ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో..

నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పుట్టాను, పెరిగాను. నేను ఏం చేసినా కూడా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. ఎవరో ఏదో అన్నారని నేను పట్టించుకోను. నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. నేను డబ్బు జనరేట్ చేయాలి. ప్రొడక్షన్ కంపెనీ నడపాలి. థియేటర్లను చూసుకోవాలి. ప్రస్తుతం ‘శాకిని డాకిని’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘డ్యాన్సింగ్ క్వీన్’ అనే మూడు సినిమాలు ఓటీటీకి ఇచ్చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌ లు సెట్స్ మీదున్నాయి. వెంకటేష్ హీరోగా ‘రానా నాయుడు’, ‘ఎఫ్ 3’లు కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. అవి రివిల్ చేశాక తప్పకుండా మీరు సర్ప్రైజ్ అవుతారు.

‘విరాటపర్వం’ ఇంకా ఐదు రోజుల బ్యాలన్స్ షూటింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటిని డబ్బుతో కొలవొద్దు. మన హైదరాబాద్‌ను దేశానికి సినీ రాజధాని చేసే విధంగా కేటీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ పరిధి పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు ఎందుకు అంత సబ్సిడీ ఇస్తున్నారు.. యూపీ ఎందుకు ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తోంది.. సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది…, డెవలప్‌మెంట్ జరుగుతుంది కాబట్టి…  సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు…. అంటూ పలు అంశాలపై సురేష్ బాబు తన అభిప్రాయాలు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్