మధ్య ఆసియా దేశాలను భూకంపాలు వనికిస్తున్నాయి. ఇటీవలి తుర్కియే భూకంపం మిగిల్చిన విషాదం మరచిపోక ముందే తాజాగా అఫ్గానిస్థాన్, తజకిస్థాన్‌లో గంటన్నర వ్యవధిలో వరుస భూకంపాలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల సమమయంలో అఫ్గానిస్థాన్‌లో భూమికంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఫైజాబాద్‌కు 315 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది.
ఇక గంటన్నర వ్యవధిలో తజకిస్థాన్‌లోనూ భూమి కంపించింది. ఉదయం 5.31 గంటలకు తజకిస్థాన్‌లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదయిందని ఎన్‌సీఎస్ చెప్పింది. కాగా, రెండు దేశాల్లో తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన ష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ నెల 23న తజకిస్థాన్‌లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.