Book publishing shrinks during the pandemic
పుస్తకం హస్త భూషణం. చేతికి పుస్తకమే అందం అని కొన్ని తరాలు అనుకున్నాయి. పుస్తకాన్ని గౌరవించాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ పుస్తకం మాత్రం కొనుక్కో- అని మొన్నటి వరకు ఒక ఆదర్శం ఉండేది.
తల్లీ నిన్ను తలంచి పుస్తకమున్ చేతన్ పూనితి…పుస్తకంలో ఉన్న విషయాన్నంతా నా మెదడులోకి చక్కగా బట్వాడా చేయి తల్లీ. నా లోపలినుండి మంచి మాటలను వెలికి వచ్చేలా చేయి తల్లీ. నా మాటలు సుశబ్దాలై ఇతరులకు ఆనందాన్ని కలిగించేలా చేయి తల్లీ. తెలుగు విద్యార్థులకే కాక యావత్ ప్రపంచ విద్యార్థులకు ప్రార్థనా గీతం కావాల్సిన పద్యమిది.
మెదడులో ఒక ఆలోచన మాటగా బయటికి రావాలంటే పరా; పశ్యంతి, మాధ్యమా, వైఖరి అని నాలుగు దశలు దాటాలి. ఈ నాలుగు రూపాలకు సరస్వతి దేవత. పెదవి దాటిన మాట వైఖరి-ఎదుటివారికి వినపడుతుంది. మిగతా మూడు దశల వాక్కు గొంతులో, మనసులో, నాభిస్థానంలో బయలుదేరినప్పుడు ఎదుటి వారికి వినపడదు.
మనతో మనమే స్వగతంలో మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా లోపల పదాలు, వాక్యాలు, భావాల భాష పరా పశ్యంతి మధ్యమ దాకా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి శరీర అవయవాల్లో భాష లేదా ధ్వనులు పుట్టి…మారి…బయటికి వినిపించడాన్ని ఇంత శాస్త్రీయంగా దర్శించిన పురాతన సమాజం ప్రపంచంలో బహుశా మనది తప్ప ఇంకేదీ ఉండకపోవచ్చు. మెదడులో ఇదివరకే రికార్డ్ అయి ఉన్న మాటలను భావానికి అనుగుణంగా శబ్దం లేదా మాటగా తీసుకురావడం సెకనులో వెయ్యో వంతు సమయంలో ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపిస్తుంది కానీ- ఆటోమేటిగ్గా జరగదు. మన ప్రయత్నంతోనే శబ్దం బయటికి వస్తుంది. ఆలోచన మెదడుది. మాటలు అందించేది మెదడు. శబ్దం వినపడేలా చేసేది మన ఊపిరితిత్తుల్లోని గాలి. నాభి దగ్గర పైకి ప్రయాణించే గాలి గొంతులో స్వర పేటికలో తంత్రుల దగ్గర మూర్ఛనలు పోతుంది. ఆపై నోట్లో అనేక భాగాల కదలికలతో ఒక్కో అక్షరం పలుకుతుంది. ఇంతకంటే లోతయిన వివరణ ఇక్కడ అనవసరం.
మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అ క్షయం- అక్షరం. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా ఏర్పడిందే లిపి.
లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది. తరువాత మెదడు చదువుతుంది. ఆపై నోరు పలుకుతుంది. బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది. పుస్తకం సరిగ్గా చదివితే ఏకకాలంలో కన్ను, మెదడు, నోరు, మనసు పనిచేస్తాయి. ఒట్టి శబ్దం చెవిన పడితే ఇంత సాంద్రంగా రికార్డు కాదు. అందుకే చదవాలి. మళ్లీ మళ్లీ చదవాలి. చదువుతూనే ఉండాలి. చచ్చినా చదువు ఆపకూడదు.
వీడియో అది ఎలా ఉంటే అలాగే కనిపిస్తుంది. వినిపిస్తుంది. ప్రింట్ లో ఉన్న విషయం అలా కాదు. ఉదాహరణకు హిమాలయం గురించి ఒక ఆడియో, ఒక వీడియో, ఒక ప్రింట్ వ్యాసం ఉన్నాయని అనుకుందాం. ఒక్కో మీడియాకు ఒక్కో పరిమితి ఉంటుంది. కానీ ప్రింట్ లో శబ్దాల ద్వారా మనమే ఒక దృశ్యాన్ని నిర్మించుకుంటాం. కొన్ని రంగులు వేసుకుంటాం. హిమాలయాన్ని తాకుతాం. ఆ చల్లదనం అనుభవించగలుగుతాం. ఆ తెల్లదనానికి కళ్లు మిరుమిట్లు గొలుపుతాయి. అంతెత్తు ఎక్కి పరవశిస్తాం. నిజానికి ఇదంతా అక్షరాలు, పదాలు, వాక్యాలతో ఏర్పడ్డ భావం. అనుభూతి. సకల ఇంద్రియాల సమ్మేళనమై మన మనో ఫలకంపైనే అంతటి హిమాలయం ఆవిష్కారమవుతోంది. ఇలా చదువుతూ మనకు మనం నిర్మించుకున్న హిమాలయం చాలాసార్లు నిజమైన హిమాలయం కంటే గొప్పదిగా ఉంటుంది.
ఊహా శక్తి పెరగాలంటే చదవాలి. అందమయిన మాటలతో అనంతమయిన భావాలను అలవోకగా చెప్పాలంటే చదవాలి. మాటల మాధుర్యం రుచి చూడాలంటే చదవాలి. చదివింది మరచిపోకుండా ఉండాలంటే మళ్లీ మళ్లీ చదవాలి.
భారతదేశంలో పుస్తకాల ముద్రణ మార్కెట్ ఏటా పదివేల కోట్ల రూపాయలు. ఇందులో తొంభై శాతం విద్యార్థులు కొనే పుస్తకాలే. ఏటా భారత్ లో సౌందర్య సాధనాల మార్కెట్ విలువ యాభై వేల కోట్ల రూపాయలు. విద్యార్థులను మినహాయిస్తే మనం కొంటున్న పుస్తకాల విలువ మహా అయితే ఏటా వెయ్యి కోట్ల రూపాయలు. స్నోలు, పౌడర్లు, యాంటీ ఏజింగ్ క్రీములు, తెలుపు- నలుపు నలుగులకు, మొహానికి వేసుకునే పెయింట్లకు మనం పెట్టే యాభై వేల కోట్ల ఖర్చులో వెయ్యి కోట్లు అంటే ఆవగింజంత.
Ebooks Are the Only Books
అసలే పుస్తకాలకు డిమాండ్ లేక విలవిలలాడుతుంటే గోరు చుట్టుపై రోకటి పోటులా కరోనా వచ్చి పడింది. విద్యార్థులు కూడా పుస్తకాలు కొనడం మాని, ఆన్ లైన్ డిజిటల్ , వర్చువల్ క్లాసుల వైపు మళ్లుతున్నారు. పబ్లిషర్లు నెత్తిన గుడ్డ వేసుకుని అడుక్కుతింటున్నారు. పెద్ద పెద్ద పబ్లిషర్లు డిజిటల్ పుస్తకాల ముద్రణలోకి దిగుతున్నారు. చిన్న పబ్లిషర్లు మట్టికొట్టుకు పోతున్నారు.
ఒంటి రంగులకు యాభై వేల కోట్లు.
మెదడు రంగులకు వెయ్యి కోట్లు.
శరీరం రంగుతేలి తళతళలాడవచ్చు.
మెదడు మిలమిలలాడడానికి, పాదరసంలా పనిచేయడానికి పుస్తకాల మేత పెట్టాలా? వద్దా?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read:
Also Read: