మహిళల టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ ను 105 పరుగులకే కట్టడి చేసిన ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని 14.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సాధించింది.
పార్ల్ లోని బొలాండ్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గాబీ లూయీస్-36; ఓర్లా ప్రెందర్ గాస్ట్-17; అమీ హంటర్ -17 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు 18.2 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఎక్సెల్ స్టోన్, సారా గ్లెన్ చెరో మూడు; చార్లోట్ డీన్ రెండు వికెట్లతో రాణించారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నాలుగు పరుగులకే తొలి వికెట్ (సోఫియా డంక్లీ -4) కోల్పోయింది. రెండో వికెట్ కు డానియెల్ వ్యాట్ (16)- ఆలీస్ క్యాప్సీ(51)లు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 11 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హిదర్ నైట్ (14); అమీ జోన్స్(12) కూడా ఔటయ్యారు. 14.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యం చేరుకుంది.
22 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ తో 51 పరుగులు చేసిన ఆలీస్ క్యాప్సి కి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.