కరోనా సమయంలో జరిగిన మాన్యువల్ లావాదేవీల వల్లే నకిలీ చలాన్ల కుంభకోణం చోటు చేసుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటికే మొత్తం తొమ్మిది మంది సబ్ రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేశామని వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ధర్మాన ఒంగోలు మండలంలో భూముల రీసర్వే జరుతుగున్న తీరును స్వయంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఇటీవల వెలుగు చూసిన నకిలీ చలాన్ల వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు.
మొత్తం 11 రెవెన్యూ డివిజన్లలో అవకతవకలు జరిగినట్లు తేలిందని, నిందితులను గుర్తించామని, అనధికారికంగా వారు వసూలు చేసిన సొమ్మును కూడా రికవరీ చేశామని చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై సమీక్షలు నిర్వహించారని, అవినీతి నిర్మూలనకు సరికొత్త సాఫ్ట్ వేర్ ను అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారని చెప్పారు.