ధాన్యం కొనుగోలులో కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని, రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని స్పష్టం చేశారు. వ్యవసాయశాఖపై క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సిఎం జగన్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.
ఇ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలని, వ్యవసాయశాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధంచేసుకోవాలన్నారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలని, రాబోయే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని కోరారు.
ప్లాంట్ డాక్టర్స్ కాన్సెప్ట్‌పై కూడా సిఎం అడిగి తెలుసుకున్నారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని, మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్నదానిపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయని, భూసారాన్నికూడా పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి, మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండ్యన్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్ వీసీ అండ్ ఎండీ జి శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : విలేజ్, వార్డు యూనిట్ గా ఎస్డీజీ సాధన: సిఎం