అసోంలోని జోర్హాట్ లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణం చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న షాపులకు విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మొత్తం 150 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి శ్రమిస్తున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.
జోర్హాట్ లో భారీ అగ్నిప్రమాదం
మంటలు మార్కెట్ మొత్తానికి విస్తరించాయని అధికారులు తెలిపారు. దీంతో షాపులన్నీ మంటల్లో కాలిపోయాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. షాపులు మూసేసిన తర్వాత ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని వెల్లడించారు. కాలిపోయిన వాటిలో ఎక్కువగా బట్టలు, నిత్యావసరాలకు చెందిన దుకాణాలే ఉన్నాయని వెల్లడించారు. మంటలను అదుపుచేయడానికి జోర్హాట్ సమీపంలో ఉన్న పట్టణాల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పిస్తున్నామన్నారు. అయితే రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టిందన్నారు. జోర్హాట్‌లో రెండు నెలల కాలంలో భారీ అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారని పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో మర్వారీ పట్టీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు.