Tuesday, September 24, 2024
HomeTrending Newsఅవినీతికి కేరాఫ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ

అవినీతికి కేరాఫ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ

దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ వారి అభివృద్ధి కోసం పాటుపడుతున్న తీరును అమలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పర్యవసానంగా ఆ శాఖ అధికారులు చేస్తున్న అవినీతి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. రాష్ట్ర వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఏర్పాటు చేసిన నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి సంబంధిత శాఖలోని అడ్మిన్ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షలాది రూపాయలను దండుకొని, అర్హులు కాని వారికి ఉద్యోగాలు అప్పగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఇటీవల వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో దాదాపు 42 పోస్టులను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో 10 వార్డెన్ పోస్టులు, రెండు పీఈటీ పోస్టులు, 15 ఎస్జీబీటీ టీచర్స్ పోస్టులు మరో 15 గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం కోసం శాఖా పరంగా నియమ నిబంధనలు జారీ చేస్తూ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. అయితే, ఇందుకు సంబంధించి విద్యార్హతలను స్పష్టంగా పేర్కొన్నది . ఇందులో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి. వాటిలో డిగ్రీతో పాటు బీఈడీ, లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లమా ఉండాలి. లేదా, సోషియాలజీ తో పాటు స్పెషల్ డిప్లమా ఉండాలి. లేదా , బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కచ్చితంగా ఉండాలి . ఈ రకంగా క్వాలిఫికేషన్ ఉన్న వారంతా దరఖాస్తు చేసుకోవాలని నియమ నిబంధనలను స్పష్టంగా చెబుతున్నాయి .

రూల్స్ జాంతానై:

అర్హతలు లేని వారు చాలామంది వార్డెన్ లుగా ఉద్యోగాలు సంపాదించారు. ఎలాంటి బిఈడి, స్పెషల్ ఎడ్యుకేషన్ లేని అభ్యర్థులను అధికారులు ఉద్యోగస్తులుగా ఎంపిక చేయడం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కేవలం డిప్లమా హోల్డర్స్ ను మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేయడం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ పక్కకు పెట్టడం వంటి చేష్టలతో, నిజమైన అర్హులకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులను అడిగితే, అంతా రూల్స్ ప్రకారమే జరిగిందంటూ దుబాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జోనల్ విధానంలో రోస్టర్ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగించాల్సి ఉంది. అలాగే రిజర్వేషన్ విధానాన్ని కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలను అధికారులు తుంగలోకి తొక్కి , తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించి నిజమైన అర్హులను పక్కన పెట్టినట్లు సమాచారం. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టడం వెనుక లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అర్హులు కాని వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తారనే అంశం పైన విచారణ చేపడితే నిజా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అర్హులైన అభ్యర్థులు ఆ శాఖ అధికారులకు కలిసి వినతిపత్రం కూడా అందజేశారు. అయినప్పటికీ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.

ఒక అధికారి — ఐదు పోస్టులకు బాస్ :

వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో ఒకే అధికారి 5 శాఖలకు బాస్ గా వ్యవహరిస్తూ అజమాయిషి చలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ శాఖలో అడ్మినిస్ట్రేషన్ ఏడి గా, వ్యవహరిస్తూనే జువైనల్ హోమ్ ఇన్చార్జిగా, హైదరాబాద్ జిల్లా ఏడిగా, టిసిపిసి (ట్రైనింగ్ కం ప్రొడక్షన్ సెంటర్ ) కు పిఓగా, టి సి టీవీ హెచ్( టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ విజువల్లి హ్యాండీక్యాప్డ్ )ప్రిన్సిపల్ గా పనిచేయటం ఆ శాఖకి చెల్లింది. ఈ ఐదు శాఖలకు చెందిన బాస్ డిపార్ట్మెంట్లో ఏది చెప్తే, అదే, ఫైనల్ గా అమలవుతుంది. దివ్యాంగుల సంక్షేమ శాఖలో ఈ బాస్ చెప్పిందే పై అధికారులు కూడా నమ్మేసి ఉత్తర్వులు జారీ చేసే పరిస్థితి నెలకొన్నట్లు ఆ శాఖలోని అసోసియేషన్ వర్గాలు కూడా పేర్కొంటున్నాయి. వికలాంగుల శాఖలో మొత్తం వార్డెన్ల నియామకాల పైన జరిగిన అవకతవకల విషయమై సంబంధిత అధికారిని, కొంతమంది అసోసియేషన్ నేతలు ప్రశ్నించినప్పటికీ, దానిపైన సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుల సంక్షేమ శాఖలో నూతనంగా ఉద్యోగులను నియమించిన విధానం మొత్తం తప్పుల తడకగా ఉంది. ఇకనైనా వీటన్నిటి పైన వెంటనే విచారణ జరిపించి, నిజమైన అర్హులకు ఉద్యోగాలు అందించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్