Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Flight- Fate:  మానావమానాలు శరీరానికే కానీ…లోపలున్న ఆత్మకు కాదు అనుకునేవారే తరచుగా విమానాల్లో తిరగ్గలుగుతారు. సంస్కృతంలో ఉపసర్గ ‘వి’ మాట ముందు చేరితే కొన్నిటికి విలువ పెరుగుతుంది- జ్ఞానం- విజ్ఞానం. కొన్నిటికి వ్యతిరేకార్థం వస్తుంది- ప్రకృతి- వికృతి. అలా మానం మాటకు ముందు ‘వి’ చేరి ‘విమానం’ అయ్యిందని విపరీతార్థం తీసుకుంటే పండితులు బాధపడతారు. నిజానికి ఆత్మాభిమానం కొలమానాలను పక్కన పెట్టి మౌనంగా ఉండకపోతే మనం మనంగా విమానాల్లో వెళ్లలేం. విమానయానాల్లో లెక్కలేనన్ని విమానావమానాలు. అందులో కొన్ని ఇవి.

పార్కింగ్ అవమానం
గాల్లో తేలిపోతున్న అనుభూతితో మనం విమానాశ్రయానికి బయలుదేరుతాం. తీరా అక్కడికెళ్లాక రష్యా క్షిపణిదాడులతో నలిగిపోయే కీవ్ నగర యుద్ధ భూమిలా సాయుధులు, నిరాయుధులు ఇక్కడ కారు ఆపద్దు అని ఒకరు, ఇక్కడే ఆపాలని మరొకరు, ఒక్క సెకనులో దిగి అర సెకనులో కారును పంపాలని ఇంకొకరు…కణత మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉంటారు.

ఐ డి కార్డు అవమానం
మనం మనమే అని రుజువు చేసుకునే ఐ డి కార్డు చేతబట్టుకుని క్యూలో మన వంతు కోసం వేచి ఉండాలి. ఆ ఆధార్ ఫోటో సాఫ్ట్ వేర్ ఏమిటో కానీ…మన మొహం మనకే అసహ్యించుకోదగ్గట్లు వస్తుంది. దాంతో అక్కడ సాయుధులు మనల్ను దొంగకోళ్ళు పట్టేవాళ్ళల్లా అనేకసార్లు చూసి…ఏదో ఈసారికి వెళ్ళండి అన్నట్లు వదిలేస్తూ ఉంటారు.

బోర్డింగ్ అవమానం
పుట్టుమచ్చలు చూపి, ఐ డి కార్డు చూపి ఎలాగో లోపలికి వెళితే బోర్డింగ్ పాస్ కోసం నిరీక్షణ క్యూలు. ఇప్పుడు వెబ్ చెకిన్ పేరిట ఆ పని మన మెడకే చుట్టాయి విమాన సంస్థలు. డిజిటల్ నిరక్షరాస్యులకు వెబ్ చెకిన్, సీట్ సెలెక్షన్ చివరి నిముషం వరకు చికాకు.

Flight Journey

లగేజ్ అవమానం
చెకిన్ బ్యాగేజ్ బరువుకు ఒక లెక్క, క్యాబిన్ బ్యాగేజ్ బరువుకు మరో లెక్క. అందులో ఏవి ఉండకూడదో అవే మనం తీసుకెళుతున్నట్లు భయం భయంగా ఉంటుంది చివరి నిముషం వరకు.

సెక్యూరిటీ అవమానం
మనం విమానం ఎక్కుతున్నామంటే నడుముకు బాంబులు కట్టుకుని వెళుతున్నట్లు అనుమానించడం సెక్యూరిటీవారి ప్రథమ కర్తవ్యం. దాంతో బెల్ట్ తీయమంటారు. బెల్ట్ తీసి చేతులు పైకెత్తగానే ప్యాంట్ జారిపోవడం అసంకల్పిత ప్రతీకార చర్యగా జరిగిపోతుంది. ఈలోపు స్కానర్ లో మన పెట్టెలో పిన్నీసు, వక్కపొడి దొరుకుతాయి. ఆ పిన్నీసుతో పైలట్ ను బెదిరించి విమానాన్ని కాందహార్ కొండల్లోకి హైజాక్ చేసే మన ఎత్తుగడ సెక్యూరిటీకి తెలిసిపోతుంది. దాంతో వక్కపొడిలో హెరాయిన్, కొకైన్ లేవని సెక్యూరిటీ తేల్చుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనల్ను పక్కకు తీసుకెళ్లి పిన్నీసుతో గుచ్చి గుచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సిన అత్యవసర పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఒంటి మీద బట్ట జారిపోకుండా పెట్టుకున్న పిన్నీసు వల్ల విమానం చేజారిపోవచ్చు.

ఎక్కేప్పుడు అవమానం
ఇన్ని అవమానాలు సహించి నేరుగా విమానం ఎక్కడానికి విమానం రూల్స్ ఒప్పుకోవు. బోర్డింగ్ కోసం మళ్లీ క్యూ. మళ్లీ పుట్టు మచ్చల ప్రదర్శనల ఐ డి కార్డు చూపడాలు. ముందు వారు. వెనుక మీరు రోబో యంత్రం ప్రకటనల చిలుక పలుకులు. విమానం ఎక్కాలంటే బోర్డింగ్ కాగానే ముందు బస్సే ఎక్కాలి. విమాన ప్రయాణం గంట అయితే ఈ బస్సు ప్రయాణం పావు గంట.

Flight Journey

దిగేప్పుడు అవమానం
విమానం ల్యాండ్ అయి దిగేప్పుడు ముందు వీ ఐ పి లు, బిజినెస్ అప్పర్ క్లాస్ వారు దిగిన తరువాత ఏ దిక్కులేని ఎకానమీ క్లాస్ ఎకనామికల్లి బ్యాక్ వర్డ్ క్లాస్ అయిన మనం దిక్కులు చూసుకుంటూ దిగులు దిగులుగా దిగాలి.

బ్యాగేజ్ అవమానం
విమానం దిగి నేరుగా వెళ్లలేం. గంట విమాన ప్రయాణానికి…కన్వేయర్ బెల్ట్ మీద మన బ్యాగేజ్ కోసం గంట నిరీక్షించాలి. ఆ బెల్ట్ అష్టోత్తర శతం సార్లు మన కళ్ల ముందు తిరుగుతూనే ఉంటుంది. నిస్సత్తువతో మన కళ్లు తిరిగి ఆ బెల్ట్ మీదే పడబోతున్నప్పుడు మన మొదటి బ్యాగ్ మన కంట్లో పడుతుంది. ఆ తరువాత గంటకు మన రెండో బ్యాగ్ మన రెండో కంట్లో పడితే పడవచ్చు. లేకపోతే లేదు.

బయటపడే అవమానం
అరపూట కన్వేయర్ బెల్ట్ మీదే తిరిగి తిరిగి ఎలాగో బయటపడితే మన సొంత కారో, అద్దె కారో, బస్సో ఎక్కడం మరొక యజ్ఞం. నేనిక్కడ మీరెక్కడ? అని డ్రయివర్ అడుగుతూ ఉంటాడు. మనం కూడా నేనిక్కడ! నువ్వెక్కడ?అంటూ చిన్నప్పుడు ఆడుకున్న పిల్లల దాగుడు మూతల ఆట కాసేపు ఆడుకుని...చివరికెలాగో బతుకు జీవుడా! అనుకుని బయటపడతాం.

అన్నట్లు-
వారం, పదిరోజులుగా ఢిల్లీ, బొంబాయి, బెంగళూరుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగిందో? లేక విమానాశ్రయ నిర్వహణలో వైఫల్యమో? తెలియడం లేదు కానీ…డొమెస్టిక్ విమానాలకే మూడు, మూడున్నర గంటల ముందు రమ్మని అడుగుతున్నారు. ఏమి చేయాలో పాలుపోక కేంద్ర విమానయాన సంస్థ తలపట్టుకుని కూర్చుని ఉంది.

ప్రయాణికుల వీపు విమానం మోత మోగుతోంది!

-పమిడికాల్వ మధుసూదన్

[email protected]

Also Read :

కలవారికి విదేశం లేనివారికే ఈ దేశం

Also Read :

భాష గాలిలో దీపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com