రాష్ట్రంలో ఎగువ ప్రాంతాల్లో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ రోజు ఉదయం వరకు వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులను దాటింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు. అత్యవసర సేవల కోసం అన్ని విభాగాల అధికారులను సన్నద్ధంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ఆదేశించారు.
వానలు, వరదలకు సంబంధించి, తక్షణమే సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.