Sunday, January 19, 2025
HomeTrending NewsAdivasi: తెలంగాణ రాజకీయాలు...ఆదివాసీల అసంతృప్తి

Adivasi: తెలంగాణ రాజకీయాలు…ఆదివాసీల అసంతృప్తి

ఆదివాసీలు సరిహద్దు జిల్లాల్లో అధికంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో మెజారిటీగా ఉండగా వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. ఆదివాసీల్లో గోండు (రాజ్ గోండ్, కోయుతూర్) కోలం, ప్రధాన్, తోటి, ఆంద్, మన్నెవార్, చెంచు, నాయకపోడు, కోయ, కొండ రెడ్లు మొత్తం 32 తెగలు ఉన్నాయి.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆదివాసీల అభివృద్ది పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్నాళ్ళుగా ఆదివాసి – లంబాడాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని పదకొండు ST స్థానాల్లో రెండు వర్గాలు ఎవరి వైపు మొగ్గుతారో అని చర్చలు జరుగుతున్నాయి.

1976కి ముందు తెలంగాణలో కేవలం తొమ్మిది ఆదిమ తెగలు మాత్రమే ఆర్టికల్ 342 ద్వారా పొందుపరిచారు. ఇందులో లంబాడాలు లేరు. 1976లో ఆర్డినెన్స్ ద్వారా లంబాడాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడం జరిగింది. ఆర్డినెన్స్ ప్రకారం తెలంగాణ లంబాడాలు విద్యకే పరిమితమైన రిజర్వేషన్లతో మైదాన తెగగా గుర్తించారు. కానీ రాజకీయ, బ్యూరోక్రాటిక్ ప్రభావాల కారణంగా లంబాడా కమ్యూనిటీ ఆదివాసీల కంటే ఉద్యోగాలలో ప్రయోజనాలను దక్కించుకొంది. ఉపాధి, విద్యలో తమను పట్టించుకోలేదని ఆదివాసీలు మండిపడుతున్నారు.

ఆదివాసీ నేత, బిజెపి నాయకుడు సోయం బాపురావు 9 డిసెంబర్ 2019న ఢిల్లీ రామ్ లీలా మైదాన్‌ వేదికగా నిర్వహించిన ఆదివాసీ ర్యాలీలో లంబాడాలను ST జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భూమి, వనరుల్లో ఆదివాసీలు, లంబాడాలు చాలా కాలంగా ఘర్షణ పడుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో బాపురావు విజయం వారి పోరాటాన్ని జాతీయ వేదికపైకి తీసుకురావడానికి సహాయపడింది. అప్పటి నుంచి తెలంగాణలో ఆదివాసీల్లో పట్టు పెంచుకునేందుకు బీజేపీ, సంఘ్‌పరివార్‌లు ఈ వివాదాన్ని ఉపయోగించుకున్నాయి. ఆదివాసీలకు చెందిన తుడుం దెబ్బ నుండి నాయకులను బిజెపిలోకి చేర్చుకున్నారు.

బిజెపి విధానం విశ్లేషించిన కాంగ్రెస్ అదే బాట పట్టింది. వరంగల్, ఖమ్మం, పాలమూరు జిల్లాల్లో ఆదివాసీలకు వచ్చే ఎన్నికల్లో జనరల్ స్థానాలను కేటాయించడాన్ని పరిశీలిస్తామని ఎఐసిసి ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 13న ఆదివాసీ కాంగ్రెస్ తెలంగాణ మహాసభ గాంధీభవన్ లో జరిగింది. ఈ సభలో మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ జనరల్ స్థానాలను ఆదివాసీలకు కేటాయించేందుకు పేర్లను ప్రతిపాదించాలని బలరాం నాయక్‌ను కోరారు. బలరాం నాయక్ లంబాడ నేత కావటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైందనే ఆరోపణలు ఉన్నాయి.

బీఆర్ఎస్ అవసరానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నా లంబాడ వర్గానికి ప్రాధాన్యత ఇస్తోందని… మంత్రి పదవి దగ్గర నుంచి ముఖ్యమైన పదవుల వరకు ఈ వర్గానికే దక్కుతున్నాయని ఆదివాసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆసిఫాబాద్ మినహా ఆదివాసీలు మెజారిటీగా ఉన్న నియోజకవర్గాల్లో కారు గుర్తుపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

దశాబ్దాలుగా లంబాడాల వద్ద డబ్బు ఉన్నందున రాజకీయ పార్టీలతో టిక్కెట్ల కోసం లాబీయింగ్ చేయగలుగుతున్నారని  ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ఆదివాసీలు పేదలు. ఆర్థికంగా లేనందున బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ వీరికి టిక్కెట్లు ఇవ్వలేదనే ప్రచారం ఉంది. గోండు, కోయ, కొండారెడ్డి, చెంచు, పర్ధాన్, కొలాం, నాయక్‌పోడ్, తొట్టి, మన్నెవార్లకు చెందిన తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీ సంఘాలు తెలంగాణలోని లంబాడా సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తుడుం దెబ్బ పేరుతో కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి.

లంబాడాలు రాష్గ్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తమ సామాజిక వర్గం వారితో సంబంధాలు కలిగి ఉంటె…ఆదివాసీల్లో అది కనిపించదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే తీసుకుంటే తూర్పు జిల్లాలోని ఆదివాసీలకు పశ్చిమ జిలాలోని వారితో పెళ్లి సంబంధాలు, బంధుత్వాలు తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ నుంచి సీతక్క, బిజెపిలో సోయం బాపు రావు, బీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మిలు అడపాదడపా ఆదివాసీల గళం వినిపిస్తున్నారు.

ఆదివాసీల్లో స్వాభిమానం, కట్టుబాటు, నిజాయీతీ, ఒకేమాటకు కట్టుబడే నైజం ఉంటుంది. నక్సల్ ఉద్యమంలో మొదటి వరుసలో ఉండి ప్రాణాలకు ఒడ్డి పోరాటం చేసింది ఆదివాసీలే అనటంలో సందేహం లేదు. చైతన్యవంతులైన లంబాడాలు నక్సల్ ఉద్యమం కన్నా బ్యాలెట్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు.

ఈ దఫా ఎన్నికల్లో ఆదివాసీలు మాకే మద్దతు ఇస్తారని పార్టీలు…ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఈ రోజు వరకు ఉన్న పరిస్థితులను… ST నియోజకవర్గాలను పరిశీలిస్తే మెజారిటి స్థానాలు విపక్షాలకే దక్కే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెపుతున్నాయి. రాజకీయ పార్టీలు ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకుగా భావించకుండా సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టకపోతే కాల క్రమంలో అసంతృప్తి సెగలు…అటవీ ఉద్యమాలకు పురుడు పోయవచ్చని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్