Thursday, May 30, 2024
Homeస్పోర్ట్స్ODI WC: కోహ్లీ రికార్డు సెంచరీలు - ఇండియాకు అప్రతిహత విజయాలు

ODI WC: కోహ్లీ రికార్డు సెంచరీలు – ఇండియాకు అప్రతిహత విజయాలు

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో ఇండియా తన జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తోంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నేడు జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికాపై 243 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ ఆడిన రోహిత్ సేన  అన్నింటిలోనూ  గెలుపు సాధించి రికార్డు సృష్టించింది.  విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో 49వ సెంచరీ నమోదు చేసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్  రికార్డును సమం చేశాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 326 పరుగులు చేయగా, సౌత్ ఆఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్  అయింది.

రవీంద్ర జడేజా మరోసారి తన స్పిన్ మ్యాజిక్ తో ఐదు వికెట్ల సాధించి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. షమీ, కులదీప్ యాదవ్ చెరో 2, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.  సౌత్ ఆఫ్రికాలో  మార్కో జాన్సేన్ చేసిన 14 పరుగులే అత్యధిక స్కోరు కావటం గమనార్హం. వాండర్ డసేన్ 13, కెప్టెన్ బావుమా, డేవిడ్ మిల్లర్ చెరో 11 పరుగులు మాత్రమే చేశారు. ఈ నలుగురే రెండంకెల స్కోరు దాటగలిగారు.

అంతకుముందు ఇండియా 62 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. శుభ్ మన్ గిల్ 24 బంతుల్లో 23 పరుగులు చేసి జట్టు స్కోరు  93 వద్ద వెనుదిరిగాడు.  ఈ దశలో విరాట్ కోహ్లీ-శ్రేయాస్ అయ్యర్ లు మూడో వికెట్ కు 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయ్యర్ 77 స్కోరు చేయగా; కేఎల్ రాహుల్ మరోసారి విఫలమై 8 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్ 29 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 121 బంతుల్లో 10 ఫోర్లతో 101, రవీంద్ర జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ తో  29 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.  సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జాన్సేన్, రబడ, శంషి, మహారాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

విరాట్ కే ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్