Forest College Research Institute Fcri Graduation Ceremony :
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కొనే దిశగా నిపుణులైన అటవీ అధికారుల అవసరం ఉందని, ఆ అవసరాలను తీర్చే దిశగా తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ విద్యార్థులను తీర్చిదిద్దుతోందని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి అన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఎంతో ముందు చూపుతో తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలోనే నెలకొల్పిన ఫారెస్ట్ కాలేజీ ఫలాలు ఇప్పుడు అందుతున్నాయని తెలిపారు. అటవీ కళాశాల & పరిశోధన సంస్థ (FCRI) ములుగులో జరిగిన పట్టభద్రుల ఉత్సవంలో శాంతి కుమారి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 2017 బ్యాచ్ B.SC. (ఆనర్స్) ఫారెస్ట్రీ విద్యార్ధులు తమ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సును పూర్తి చేసిన సందర్భంగా వారికి డిగ్రీల ప్రధానం ములుగు క్యాంపస్ లో ఘనంగా జరిగింది. పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీ.లక్ష్మి నారాయణ, హార్టీ కల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నీరజా ప్రభాకర్, ఫారెస్ట్ కాలేజ్ డీన్ ప్రియాంక వర్గీస్ లతో కలిసి 48 విద్యార్ధులకు డిగ్రీ సర్టిఫికేట్ల ప్రధానం చేశారు.
ప్రారంభించిన కొద్ది సంవత్సరాల్లోనే తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అంతర్జాతీయ ప్రమాణాలను సాధించిందని, విద్యార్థుల్లో పోటీతత్వం నింపుతూ కెరీర్ లో రాణించేలా ప్రమాణాలను నెలకొల్పిందని పీసీసీఎఫ్ ఆర్. శోభ అన్నారు. అత్యుత్తమ సౌకర్యాలు, పచ్చదనంతో నిండిన ఫారెస్ట్ కాలేజీ క్యాంపస్ ను చూస్తుంటే తెలంగాణ సాధించిన ప్రగతి అర్థమౌతోందని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ పీ.లక్ష్మి నారాయణ అన్నారు. సవాళ్లతో కూడి క్లిష్టమైనదిగా భావించే అటవీ విద్య వైపు పెద్ద సంఖ్యలో అమ్మాయిలు రావటం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు హార్టీ కల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ నీరజా ప్రభాకర్. జాతీయ స్థాయి అటవీ కళాశాలను నెలకొల్పటంతో పాటు, మంచి సివిల్ సర్వీసు అధికారులను దేశానికి అందించాలనే సంకల్పంతో ఏర్పాటైన ఫారెస్ట్ కాలేజీ ఆ దిశగా అడుగులు వేస్తోందని డీన్ ప్రియాంక వర్గీస్ అన్నారు. కళాశాల ప్రగతి నివేదికను ఆమె సమర్పించారు. ఫారెస్ట్ కాలేజీని మరింతగా విస్తరిస్తూ యూనివర్సిటీగా గుర్తించే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని, అలాగే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్ ను కూడా ప్రారంభించామని వెల్లడించారు.
మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్రతిభా పురస్కారాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బంగారు పథకం ప్రధానం. తమ నాలుగేళ్ల కోర్సు లో భాగంగా వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనపరిచిన ఎనిమిది మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేక ప్రతిభా పురస్కారాలను, మెడల్స్ ను అధికారులు అందించారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున అందించే గోల్డ్ మెడల్ ను పాటిల్ జ్యోత్స్న అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ కార్పోరేషన్ ఎండీ చంద్రశేఖర రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ లు అక్బర్, సునీతా భగవత్, రిటైర్డ్ ఉన్నతాధికారులు బీపీ ఆచార్య, పీ.కే.జా, మనోరంజన్ భాంజా, డిప్యూటీ డైరెక్టర్లు సుతాన్, శ్రీనివాస్, నర్సింహా రెడ్డి, కాలేజీ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: అడవి తల్లి ఆడబిడ్డ