మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ, ఆమె అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. ఆళ్లగడ్డలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గం కొత్తపల్లె గ్రామంలో జరుగుతోంది. నిన్న సాయంత్రం ఈ యాత్రలో భూమా వర్గంతో పాటు ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు. సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడ్డారు, ఈ దాడిలో సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అనతరం ఆయన్ను పోలీసులు సురక్షితంగా అక్కడినుంచి తరలించారు.
తన సమక్షంలోనే ఈ దాడి జరగడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఘర్షణ వాతావరణానికి దారితీసిన పరిస్థితులపై పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి అడిగి తెలుసుకున్నారు. పార్టీ సీనియర్లతో ఓ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల పట్ల అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆళ్ళగడ్డలో అఖిలప్రియను అరెస్టు చేసి నంద్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. యాత్రలో సుబ్బారెడ్డి తన చున్నీ పట్టుకొని లాగారని, దీనిపై ప్రశిస్తే దూషించారని, అందుకేతన అనుచరులు దాడికి పాల్పడ్డారని అఖిలప్రియ వెల్లడించారు.