Sunday, February 23, 2025
Homeసినిమాసంక్రాంతికి మంచి వినోదం క‌లిగించే సినిమా ‘హీరో’ : శ్రీరామ్ ఆదిత్య‌

సంక్రాంతికి మంచి వినోదం క‌లిగించే సినిమా ‘హీరో’ : శ్రీరామ్ ఆదిత్య‌

Out & Out entertainer ‘Hero’: 2015లో ‘సుధీర్‌బాబుతో భ‌లే మంచిరోజు’, 2017లో ‘శ‌మంత‌క‌మ‌ణి’, 2018లో ‘దేవ‌దాస్’ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన యంగ్ డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య‌ ఇప్పుడు గ‌ల్లా అశోక్‌ను హీరోగా ప‌రిచయం చేస్తూ ‘హీరో’ సినిమా రూపొందించారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లోనే…

“నా ద‌గ్గ‌రున్న క‌థ‌కు అశోక్ క‌రెక్ట్‌ గా స‌రిపోతాడ‌ని భావించి ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకున్నాను. అశోక్ త‌న అమ్మ గారు ప‌ద్మ‌గారిని ప‌రిచ‌యం చేయ‌డంతో ఆమెకూ న‌చ్చి సినిమా ప‌ట్టాలెక్కింది. అశోక్ కు సినిమాపై విప‌రీత‌మైన ఇంట్రెస్ట్ వుంది. నా ద‌గ్గ‌ర వున్న క‌థ‌కు కొత్త‌వారైతేనే పూర్తి న్యాయం జ‌రుగుతుంద‌నే అశోక్ ను తీసుకున్నాం. టైటిల్ ప‌రంగా చెప్పాలంటే… హీరో అవ్వాల‌నుకునే కుర్రాడి క‌థ కాబ‌ట్టి యాప్ట్ గా అనిపించింది.

చాలా మంది ఏదో సంద‌ర్భంలో హీరో అవ్వాల‌నుకుంటారు. న‌లుగురిలో మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఫీలింగ్ వుంటుంది. ఇది కామ‌న్ పాయింట్ ఇది నా అనుభ‌వంతో తీసిన క‌థ‌కాదు. చుట్టూ స్ట‌డీచేసి రాసుకున్న క‌థ‌. ‘హీరో’  ఎటువంటి విసుగు కలిగించ‌కుండా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో తీశాం. చూసిన ప్రేక్ష‌కుడు రెండు గంట‌లు న‌వ్వుకుంటూనే వుంటారు. అశోక్‌ను కొత్త హీరోని చూశామ‌నే ఫీలింగ్ క‌ల‌గ‌దు.

జోన‌ర్ ప‌రంగా చెప్పాలంటే.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుంటూనే ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ స్కృశించ‌ని అంశం ఇందులో వుంటుంది. విడుద‌లైన టీజ‌ర్‌లో అశోక్ ను కౌబాయ్‌గా, జోక‌ర్‌గా ఇలా చూసుంటారు. క‌థ‌లో అటువంటి వైవిధ్యాలు కుదిరాయి. కౌబాయ్ సినిమా చేయాల‌నేది ఎప్ప‌టినుంచో నా డ్రీమ్‌. అటువంటి సినిమా అంటేనే సూప‌ర్ స్టార్ కృష్ణ‌, మ‌హేష్‌బాబు గుర్తుకు వ‌స్తారు. సినిమాలో మొద‌టి ప‌దినిముషాలు అస్స‌లు మిస్ కావ‌ద్దు.

కోవిడ్ వ‌ల్ల సినిమాకు గ్యాప్ వచ్చింది. నా ద‌గ్గ‌ర ప‌ది క‌థ‌లున్నాయి. నాకు కొత్త‌గా అనిపిస్తేనే, ఎవ్వ‌రూ ఈ పాయింట్‌ను చెప్ప‌లేద‌ని అనుకుంటేనే సినిమా చేస్తాను. హీరో సినిమాలో అటువంటిదే చూస్తారు. అశోక్‌ను చూస్తే కొత్త‌వాడ‌నే ఫీలింగ్ రాకూడ‌ద‌ని మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్‌బాబు సినిమాలు చూడ‌మ‌ని చెప్పాను. వారిలో కామెడీ టైమింగ్ నాకు బాగా న‌చ్చుతుంది. యాక్టింగ్ కోర్సు చేయ‌డం కంటే చాలామంది స్టార్స్‌ ను చూసి మ‌నం చాలా నేర్చుకోవాల్సి వుంటుంది. వారిని ప‌రిశీలించి మ‌న‌కు న‌చ్చింది మ‌న‌కు అప్ల‌య్ చేసుకోవాలి. అందుకే అశోక్‌ను సినిమాలు చూడ‌మ‌ని చెప్పాను.

హీరో యు.ఎస్‌.లో చ‌దివినా త‌న‌కు తెలుగు రాయ‌డం, మాట్లాడ‌డం బాగా తెలుసు. నాకే స‌రిగ్గా తెలీదు. డ‌బ్బింగ్ కూడా త‌నే చెప్పుకున్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓటీటీలో ప‌లు భాషా చిత్రాలు చూశాం. చాలామందికి కొన్ని న‌చ్చాయికూడా. అలాంటివారికి కూడా హీరో సినిమా న‌చ్చుతుంది. ఎందుకుంటే రొటీన్ ఫార్మెట్ కాకుండా భిన్నంగా తీసిన సినిమా ఇది. థియేట‌ర్ల‌లో చూస్తేనే బాగుంటుంది.

ఈ సినిమాలో ఛాలెంజింగ్ ఏంటంటే, ప్ర‌యోగంతోపాటు వాణిజ్యాంశాలుకూడా వుండేలా చేయ‌డ‌మే. క‌రోనా గ్యాప్ వ‌ల్ల షూటింగ్ చేసింది చూసుకుని ఇంకా ఏమైనా బెట‌ర్ చేయ‌వ‌చ్చ‌నేది ఆలోచించేందుకు  తోడ్ప‌డింది. అంద‌రిని ఒప్పించేలా సినిమా చేయాలి అనేది నారూల్‌. నిధి అగ‌ర్వాల్ ఫ్రొఫెష‌న‌ల్‌గా న‌టించింది. ఇంత‌కుముందు గ్లామ‌ర్ పాత్ర‌లు చేసినా హీరో సినిమాలో స‌హ‌జంగా వుండే పాత్ర పోషించింది.

లాక్‌డౌన్ వ‌ల్ల న‌టీన‌టుల ఆహార్యంలో తేడాలున్నా క‌థ‌లో మాత్రం ఎటువంటి మార్పులేకుండా తీశాం. కంటెన్యూటీ సీన్స్ అనేవి ఛాలెంజింగ్ అనిపించాయి. కృష్ణ గారు నేను చేసిన `భ‌లేమంచి రోజు` చూశారు. మెచ్చుకున్నారు. ఇప్పుడు `హీరో` సినిమా చూశారు. చాలా బాగాతీశావ్ అన్నారు. ఆయ‌న మాట మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. రాజ‌మౌళిగారు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. నా ఫేవ‌రేట్ ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఆయ‌న చేసిన బాహుబ‌లి ఒక‌టికి వంద‌సార్లు చూశాను. ఎందుకటే స్టోరీ టెల్లింగ్ ఆయ‌న్నుంచి నేర్చుకోవాలి. అంత బాగా చెబుతారు.

ఇక కెమెరా మెన్‌లు ఇద్ద‌రు మారినా క‌ల‌ర్ పాట్ర‌న్‌లో ఎటువంటి మార్పులేదు. క‌థ మార‌న‌ప్పుడు అవేవీ మార‌వుక‌దా. స‌మీర్ రెడ్డిగారు నా రెండో సినిమాకు ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఒక సీన్ చెబితే చాలు అన్నీ ఆయ‌నే చూసుకుంటారు. ఓటీటీ వైపు వెళ్లాల‌ని లేదు. ముందు ముందు నిర్మాణంలోకి వెళ‌తానేమో చెప్ప‌లేను. అస‌లు హీరో సినిమాను న‌వంబ‌ర్‌లోనే విడుద‌ల చేద్దామ‌నుకున్నాం. అప్ప‌టికీ ఇంకా థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తారోరారో అనే సందిగ్ధంలో వున్నాం. ఆ త‌ర్వాత సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డంతో పండుగ‌నాడు ఎంట‌ర్‌టైన్ మెంట్ సినిమా వుండాల‌ని వ‌స్తున్నాం. సంక్రాంతికి మంచి వినోదం క‌లిగించే సినిమా అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. కొత్త సినిమాలు ఇంకా ఏమీ అనుకోలేదు.

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్