Saturday, September 21, 2024
Homeసినిమాఈ 'గమనం' ఎటువైపు? 

ఈ ‘గమనం’ ఎటువైపు? 

Confused Gamanam: కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు .. అందుకు దగ్గరగా కొన్ని జీవితాలు కనిపిస్తుంటాయి. కానీ కొన్ని జీవితాలను తీసుకుని కూడా తెరపై కథలుగా ఆవిష్కరించే ప్రయత్నాలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. జీవితాల్లో నుంచి పుట్టిన కథల్లో వినోదం పాళ్లు తక్కువగా ఉంటాయి .. ఎమోషనల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమోషన్ కి కనెక్ట్ అయితే కథలో ప్రేక్షకుడు కూడా ఒక పాత్రగా మారిపోతాడు. తాను థియేటర్లో కాకుండా వీధి అరుగుపై కూర్చుని ప్రత్యక్షంగా జరుగుతున్న సంఘటనలను చూస్తున్నట్టుగా ఫీలవుతాడు. అలాంటి ఒక ఫీల్ ను కలిగించే కథగా ‘గమనం’ గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ ద్వారా పలకరించింది.

శ్రియ .. శివ కందుకూరి .. ప్రియాంక జువాల్కర్ .. సుహాస్ .. బిత్తిరి సత్తి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ – కాళీ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మించగా, సుజనారావు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఇది ఆమెకి మొదటి సినిమా. ‘గమనం’ అంటే ప్రయాణం అని అర్థం. ఎవరిది ఈ ప్రయాణం? ఎటు వైపుకు ప్రయాణం? అనే ప్రశ్నలకు సమాధానంగా కనిపించేదే ఈ కథ. ఈ కథ మూడు జీవితాలను ఏక కాలంలో స్పర్శిస్తూ సాగుతుంటుంది. వినికిడి లోపం కలిగిన కమల (శ్రియ) ఒక మురికివాడలో నివసిస్తూ ఉంటుంది. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ, దుబాయ్ నుంచి భర్త ఎప్పుడు వస్తాడా? అని చంటిబిడ్డతో కలిసి వేయికళ్లతో ఎదురుచూస్తుంటుంది.

ఇక అలీ – జారా (శివ కందుకూరి – ప్రియాంక జవాల్కర్) ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించాలనేదే  అలీ లక్ష్యం. అతని ఆశయం నెరవేరాయాలని ఆశించే జారా .. అందుకోసం ఏ త్యాగమైనా చేసే ఆమె ప్రేమ. ఆర్ధికంగా వాళ్ల పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇక మరో వైపున ఒక కేక్ కొనుక్కుని పుట్టినరోజు జరుపుకోవడమే .. పుట్టకకి సార్థకత అని భావించే ఇద్దరు వీధి బాలలు. కథ అంతా కూడా ఈ మూడు జీవితాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరికివారు తమ ముందున్న లక్ష్యానికి చేరుకోవడానికి తమవంతు ప్రయత్నం చేస్తుంటారు.

అలాంటి పరిస్థితుల్లో ఒక రాత్రివేళ కురిసిన వర్షం, వాళ్ల జీవితాలను అల్లకల్లోలం చేస్తుంది. ఆ గండం నుంచి వాళ్లు బయట పడ్డారా? తమ ఆశయాన్ని అందుకోగలిగారా? తమ లక్ష్యానికి చేరుకోగలిగారా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథ విషయానికి వస్తే ఎక్కడ ఎలాంటి హడావిడి  లేకుండా నిదానంగా నడుస్తుంది. కొంతమందికి అది సహజత్వంగా కనిపిస్తే, మరి కొందరికి కథ అక్కడక్కడే తిరుగుతుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అసలైన ఎపిసోడ్ వర్షం నీళ్లు ఇంట్లోకి వచ్చేయడం .. బయటికి వెళ్లే అవకాశం లేక శ్రియ చంటిబిడ్డతో ప్రమాదంలో పడటం. కాస్త టెన్షన్ పెట్టే ఎపిసోడ్ ఇదే.

ఒక వైపున శ్రియ ఇల్లంతా వరద నీళ్లలో నిండిపోతుంటుంది. అదే సమయంలో వీధి బాలలు ‘గూనలు’లో తలదాచుకుంటారు. ఆ వర్షంలో జారా తన లవర్ అలీ కోసం వెదుకుతుంటుంది. అతను వరద నీళ్లలో నుంచి స్కూల్ పిల్లలను కాపాడే ప్రయత్నంలో ఉంటాడు . ఇంకో వైపున నిత్యామీనన్ కచ్చేరి నడుస్తుంటుంది. ఒకచోట వరదనీరు .. మరో వైపున అంతగా వర్షం లేని సీన్స్ ను చూపిస్తూ ఉండటంతో ఉత్కంఠ సడలిపోతుంది. చివరి నిమిషం వరకూ ప్రయత్నించి శ్రియ బయటపడే మార్గం కూడా సిల్లీగా అనిపిస్తుంది. అలాగే జోరు వానలో పిల్లలు మట్టి వినాయకుడి బొమ్మలు అమ్మడం కూడా.

పాటలు సందర్భానుసారమే వచ్చి వెళతాయి .. ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఆ సందర్భానికి ఓకే అనిపిస్తాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగులు పాత్రల స్వభావానికి తగినట్టుగానే ఉన్నాయి. ‘ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారంటే ఎంత చెత్త ఏరుకున్నారో’ అని వీధి బాలలు అనుకునే డైలాగ్. ‘నాకే కాదు నీకు కూడా వినిపించదని నాకేం తెలుసు’ అని వినికిడి లోపం ఉన్న శ్రియ దైవనింద చేస్తూ చెప్పే డైలాగ్స్ మనసుకు పట్టుకుంటాయి. ఇక ఏ కథకైనా ముగింపు ప్రాణం లాంటిది. ఒక సినిమాకి ఎన్ని మార్కులు ఇవ్వొచ్చుననేది  క్లైమాక్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రధానమైన పాత్రలకు జరిగే న్యాయంపైనే కథకు న్యాయం జరగడమనేది ఆధారపడి ఉంటుంది. మరి ఈ కథకు ఎంతవరకూ న్యాయం జరిగిందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అందుకోసం అమెజాన్ ప్రైమ్ లోకి అడుగుపెట్టాల్సిందే!

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్