Sunday, January 19, 2025
HomeTrending Newsకాళేశ్వరం వల్లే ఈ ముంపు : సిఎం రమేష్

కాళేశ్వరం వల్లే ఈ ముంపు : సిఎం రమేష్

కాలేశ్వరంలో నీరు నింపి ఒక్కసారిగా గేట్లు ఎత్తడం వల్లే మొన్న గోదావరి పరివాహక గ్రామాలకు వరద ముప్పు ఏర్పడిందని బిజెపి రాజ్య సభ సభ్యుడు సిఎం రమేష్ స్పష్టం చేశారు. పోలవరం వల్ల ఈ ముంపు ఏర్పడలేదని,  ఈ విషయంలో తెలంగాణ నేతలు చేస్తున్న వాదనలను తిప్పికొట్టలేని పరిస్థితుల్లో  ఏపీ ప్రభుత్వం ఉందని, వారి సంబంధాల వల్లే మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఎంపీలు సిఎం రమేష్, జీవీఎల్ నరసింహా రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రజులు మీడియాతో మాట్లాడారు.

గోదావరికి వరదలు వచ్చి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటే అక్కడ కనీస సహాయ కార్యక్రమాలు కూడా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, విపత్తుల నిధులు కూడా పక్కదారి పట్టించారని రమేష్ ఆరోపించారు. ఇలాంటి వరదల సమయంలో నష్టం అంచనాకు బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని కూడా చేయడంలేదని, వారి ప్రాధాన్యాలు అన్నీ వేరేగా ఉన్నాయని మండిపడ్డారు. మైనింగ్, లిక్కర్, శాండ్ ద్వారా అక్రమార్జనపైనే వారు దృష్టి పెట్టారని తీవ్రంగా ధ్వజమెత్తారు.  రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా నేరుగా బ్యాంకులకు లేఖలు రాయడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. అప్పులతోనే ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారన్నారు.

కేంద్రం ఇస్తోన్నఉచిత బియ్యం పంపిణీ నిలిపివేయడంపై ఆందోళనా కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని, అదే విధంగా స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన నిధుల దారి మళ్లింపుపై కూడా  పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని సోము వీర్రాజు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో  కనీసం పారిశుధ్య కార్యక్రమాలు కూడా చేయలేకపోతున్నారని విమర్శించారు.  రేపు తమ పార్టీ ఎంపీలు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిని కలిసి స్థానిక సంస్థల నిధులపై ఫిర్యాదు చేస్తారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కేవలం అప్పులపైనే ఆధారపడిందని, కార్పొరేషన్ల  ద్వారా అప్పులు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఎంపీ జీవీఎల్ ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని, లేకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలవుతారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి దిగజారక ముందే ప్రభుత్వం మేల్కొనాలని కోరారు.  ‘కేంద్ర సహకారం-  రాష్ట్ర పార్టీల అసత్య ప్రచారం’  పేరిట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటివరకూ కేంద్రం అందించిన సహకారంపై తమ పార్టీ ప్రచురించిన పుస్తకాన్ని రాష్ట్రానికి చెందిన అందరు ఎంపీలకూ పంచుతామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్