దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు నేడు 14 అక్టోబర్ 2021 శుద్ధ నవమి, గురువారం ఎనిమిదవ రోజున శ్రీ మహిషాసురమర్దని అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజును మహార్ణవమిగా జరుపుకుంటారు.
అష్ట భుజాలతో అవతరించి, సింహవాహనంపై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలు కడతేర్చింది శ్రీ దుర్గమ్మ తల్లి. శ్రీ మహిషాసుర మర్ధిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల అరిషడ్ వర్గాలు నశిస్తాయని ప్రతీతి. భక్తుల్లో సాత్విక భావం కలుగుతుంది. సర్వదోషాలు పటాపంచలై… ధైర్యం, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.
నవరాత్రులలో తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో, రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా, మూడోరోజున శ్రీ గాయత్రీ దేవిగా, నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, నిన్న ఐదో రోజున శుద్ధ పంచమి, షష్టి తిథులు ఒకేరోజు వచ్చినందున మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు ఆశీస్సులు అందించారు. మొన్న 12వ తేదీ ఆరవ రోజున న మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారు ఆశీస్సులు అందించారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న 13వ తేదీ ఏడవ రోజున శ్రీ దుర్గాదేవిగా అమ్మవారు భక్తులను అలరించారు.
15-10-2021 శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి) అవతారంలో అమ్మవారు ఆశీస్సులు అందిస్తారు.
అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తెప్పోత్సవం నిర్వహించాలా వద్దా అనేదానిపై సందిగ్ధం నెలకొంది.