హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆషాఢ బోనాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. గోల్కొండ కోటలో వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించటం ద్వారా ఉత్సవాలు మొదలు కావటం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజు ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో 500 బోనాలు అమ్మవారికి సమర్పించారు.
గోల్కొండ బోనాల తొలి పూజల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాలతో నెల రోజులపాటు జంట నగరాలు సందడిగా మారనున్నాయి.
జంట నగరాల్లో మొదట గోల్కొండ బోనాలతో ప్రారంభం అయి సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో వేడుకగా సాగుతాయి. ఆ తర్వాత లాల్ దర్వాజా మహాకాళి బోనాలతో వేడుకలు ముగుస్తాయి.
గోల్కొండ ఆషాడ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని, తద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సిఎం అన్నారు. డప్పులు, మేళ తాళాల నడుమ మహిళలు బోనమెత్తుకోని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తారని సిఎం తెలిపారు. తర తరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు.
బోనాల పండుగ ప్రారంభం నాడు వాన చినుకుల రూపంలో మనందరిమీద అమ్మవారు కరుణాకటాక్షాలు కురిపిస్తుండడం శుభసూచకమని సిఎం అన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా కొనసాగుతూనే వుండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని సిఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.