ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే..
‘సీటీమార్’ సినిమా చేయాలనుకున్నప్పుడు సంపత్ నంది ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్‌తో ఓ కథ నెరేట్ చేశాడు. ఆ కథ నాకెందుకో నచ్చలేదు. తర్వాత ఒక నెల తర్వాత మరో కథతో వచ్చాడు. తను చెప్పిన పాయింట్ బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలేవీ చేయలేదు. అది కూడా అమ్మాయిల కబడ్డీ టీమ్ కోచ్‌గా నా రోల్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి కథ చెప్పాడు సంపత్. అంతా నచ్చడంతో జర్నీ స్టార్ట్ అయ్యింది. భీమిలీ కబడ్డీ జట్టు, కబడ్డీ కబడ్డీ సినిమాలు మినహా పూర్తి స్థాయి కబడ్డీ కాన్సెప్టుతో సినిమాలేవీ రాలేదు. అయితే.. అమ్మాయిల కబడ్డీ టీమ్ బేస్ చేసుకుని రన్ అయ్యే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా నాకు తెలిసి రాలేదు. నేను హీరోగా ఇలాంటి సబ్జెక్టుతో సినిమా చేయలేదు. నాకు కొత్తగా అనిపించింది. సినిమాలో ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్లతో ఓ ఫార్మేట్‌లో సినిమా చేయడం అనేది నాకు నచ్చింది”
“మా అమ్మాయిల కబడ్డీ టీమ్‌లో నలుగురు నిజమైన కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. నేషనల్స్ ఆడారు. షూటింగ్ సమయంలో వారితో మాట్లాడాను. ఆ సమయంలో వారు ఎలా కష్టపడి ఆ స్థాయికి వచ్చారనే విషయాలు తెలిసింది. నిజంగా మనలో ఆటగాళ్లు ఓ స్థాయికి చేరుకోవాలంటే ఎలాంటి కష్టాలు దాటాలో తెలిసిందే. వాళ్ల కష్టాలు తెలిసిన తర్వాత బాధేసింది. నలుగురు ప్లేయర్స్ మినహా మిగతా వారందరూ కొత్తవాళ్లే. మూడు నెలల పాటు ప్రాక్టీస్ చేశారు. వాళ్ల ప్రాక్టీస్ సమయంలో మోకాళ్లు దెబ్బలు తగిలించుకుని వెళుతుండేవారు. వాళ్లని చూస్తే పాపమనిపించేది. కానీ వాళ్లు అవేమీ పట్టించుకోకుండా చాలా డేడికేషన్‌తో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు”
“మహిళా ఆటగాళ్లను బయటి వ్యక్తులు ఎలా చూస్తున్నారనేది మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఆ పాయింట్‌ను డిస్కస్ చేశాం. ఖచ్చితంగా అది ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఏ ప్లేయర్ అయినా డ్రెస్ కోడ్ ఫాలో కావాలే తప్ప, కావాలనే చిన్న డ్రెస్సులు వేసుకోరు కదా, మనం చూసే చూపులోనే తప్పు ఉంటుంది. సినిమా నేను కబడ్డీ కోచ్‌గా కనిపిస్తాను. ఆ కోచ్‌కు ఓ గోల్ ఉంటుంది. ఆ గోల్‌ను రీచ్ కావడానికి ఆ అమ్మాయి టీమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాడు. అలా వెళ్లే క్రమంలో తను ఎదుర్కొన్న సవాళ్లేంటి? దాన్ని ఎలా దాటాడనేదే సినిమా. స్పోర్ట్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా కలిసి ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ కూడా సమాంతరంగా నడుస్తుంటుంది”
“సంపత్‌తో నేను చేసిన గౌతమ్ నంద సినిమా విషయంలో మేం అనుకున్న రిజల్ట్ రాలేదు. దానికి చాలా కారణాలుండొచ్చు. అయితే ఆ సినిమా విడుదలైన తర్వాతే ‘నీతో మరో సినిమా చేస్తాను’ అని సంపత్ నందికి చెప్పాను. అన్నట్లుగానే ‘సీటీమార్’ సినిమా చేశాం. తమన్నా కూడా ఇందులో జ్వాలారెడ్డి అనే పాత్రలో నటించారు. తను కూడా కబడ్డీ కోచ్ పాత్రే చేసింది. తను చేసిన పాత్ర చాలా స్ట్రాంగ్ ఉమెన్ రోల్. రెండు, మూడు సార్లు ఇది వరకు తమన్నాతో సినిమా చేయాలని అనుకున్నాం కానీ… డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల కుదరలేదు”
“మణిశర్మగారు ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తారనే సంపత్ చెప్పాడు. నేను ఇప్పటి వరకు మణిగారితో ఏడు సినిమాలకు వర్క్ చేస్తే, అందులో ఆరు సినిమాలు హిట్స్ ఉన్నాయి. ఆయన మ్యూజిక్ ఇస్తున్నారనగానే ఖచ్చితంగా మంచి మ్యూజిక్ ఇస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చింది. సాంగ్సే కాదు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్బుతంగా ఇచ్చారు. ఇదేం సందేశాత్మక చిత్రం కాదు. 2019 డిసెంబర్‌లో ‘సీటీమార్’ షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. 2020 వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం కానీ కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఫిబ్రవరి 2021లో రిలీజ్ చేద్దామని అనుకున్నప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో మళ్లీ సినిమా ఆగింది”
“సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ప్రతి ఒకరూ అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో నిర్మాతల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పడు మాకు థియేటర్లు వచ్చే అవకాశం ఉండటంతో సినిమాను విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు కూడా సినిమా థియేటర్లకు వచ్చి ఆదరిస్తున్నారు.
ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల గురించి నేను కామెంట్ చేయను. వాళ్ల స్థానంలో కూర్చుని ఆలోచిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఏ నిర్మాత అయినా ఆరేడు నెలల్లో సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని అనుకుంటాడు. ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమాలు చేస్తారు. ఆలస్యం అయ్యే కొద్ది వడ్డీలు పెరుగుతుంటాయి కదా. వాళ్ల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఓటీటీ కూడా మంచి ఫ్లాట్‌ఫామ్. భవిష్యత్తులో ఓటీటీ ఇంకా బావుంటుందని అనుకుంటున్నాను. థియేటర్స్ ఎప్పటికీ ఉంటాయి. ఓటీటీ అనేది ఆడిషనల్ అడ్వాంటేజ్ అనుకోవాలి. మాస్, క్లాస్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఈతరం సినిమాస్ బ్యానర్‌ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పూర్తి కావచ్చింది. దాని తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది.” అంటూ విశేషాలు వెల్లడించారు గోపీచంద్.