చరిత్రలో ఎక్కడైనా పేదలకు ఇళ్ళు ఇవ్వాలని ప్రభుత్వంపై విపక్ష పార్టీలు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, దీనికి భిన్నంగా పేదలకు ఇళ్ళ కోసం ప్రభుత్వమే పోరాటం చేయాల్సిన స్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. న్యాయ ప్రక్రియలో పోరాటం చేసి చివరకు విజయం సాధించామని గుర్తు చేశారు. తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జోగి మీడియాతో మాట్లాడారు.
అమరావతి ప్రాంతంలో నిరు పేదలకు పట్టాలు ఇవ్వాలని మనసున్న సిఎం జగన్ ఓవైపు ఉంటే, చంద్రబాబు పెత్తందారుల పక్షాన నిలిచారని జోగి అన్నారు. పేదలు పేదలుగానే ఉండాలని, వారికి పట్టాలు ఇవ్వకూడదంటూ చంద్రబాబు… ఇక్కడి నుంచి ఢిల్లీ సుప్రీం కోర్టు వరకూ కోట్ల రూపాయల ఖర్చుతో న్యాయవాదులను పెట్టి మరీ వాదించారని, కానీ చివరకు సిఎం జగన్ విజయం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు. రేపు వెంకటాపాలెంలో జరిగే కార్యక్రమంలో 50,793 అక్క చెల్లెమ్మలకు పట్టాలతో పాటు ఇల్లు నిర్మించేందుకు కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వబోతోందని వివరించారు.
రాజధానిలో పేదలు నివసిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని, అంటరానితనం అంటూ చెప్పిన ఏకైక నాయకుడు, దుర్మార్గుడు చంద్రబాబు మాత్రమేనని ఘాటుగా విమర్శించారు. రాజధాని నిర్మించేందుకు పేదలు కావాలి కానీ, ఆ రాజధానిలో పేదలు నివసించకూడదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. బాబు పెత్తందారీ కోటను బద్దలుకొట్టామని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఈ నిరుపేదలైన అక్కచెల్లెళ్ళు తెలుగుదేశం పార్టీ కోటను బద్దలు కొట్టి.. సెంటు భూమి పూడ్చడానికి కూడా పనికిరాదని చంద్రబాబు అన్నాడో అదే సెంటు భూమిలో ఆ పార్టీని పాతిపెడతామని జోగి హెచ్చరించారు.