ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ ప్రశ్నించకుండా భయపెట్టేందుకే గన్నవరంలో విధ్వంసానికి వైసీపీ పాల్పడిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, పోలీస్ టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని ధ్వజమెత్తారు. గన్నవరంలో బాదితులపైనే కేసులు పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. గన్నవరం ఘటనపై రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. బడుగు, బలహీనవర్గాలను అణచివేసే కుట్రలో భాగంగానే ఈ హింస చోటుచేసుకుందని, దొంతు చిన్నా అనే టిడిపి నేత ప్రశ్నించినందుకే ఈ దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అణచివేతకు గగురైతే నష్టపోయేది ప్రజలేనని హెచ్చరించారు. జగన్ తన రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను పావుగా వాడుకుంటున్నారని, పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, క్రిస్టియన్ అయిన గన్నవరం సిఐ కనకారావుతో ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసు పెట్టించి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే స్వయంగా ఈ దాడులకు వ్యూహరచన చేశారన్నారు. ప్రభుత్వమే తన స్వార్ధ ప్రయోజనాలకోసం శాంతి భద్రతల సమస్య సృష్టిస్తుంటే, దీనికో కొందరు పోలీసులు భాగస్వామ్యులు కావడం దురదృష్టకరమన్నారు.
ఏపీలో ధర్మానికి-అధర్మానికి; ప్రజాస్వామ్యానికి- నియంత పోకడలకూ మధ్య యుద్ధం జరుగుతోందని… రాష్ట్రాన్ని దుర్మార్గుల నుండి కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, దీనికి ప్రజలు కలిసి రావాలని పిలుపు ఇచ్చారు. ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని, సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎడుర్కొందామని.. తద్వారా మన భవిష్యత్ ను, మన బిడ్డలా భవిష్యత్ ను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు.
Also Read : చట్ట ప్రకారం పనిచేయండి: బాబు సూచన