ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు ఎక్కువకాలం నిలవబోవని ఇప్పటం తీర్పుతో తేటతెల్లమైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటం గ్రామంలో చట్ట ప్రకారమే కూల్చివేతలు జరిగినట్లు కోర్టు కూడా చెప్పిందన్నారు. ఆక్రమణలను చట్టబద్ధంగా తొలగించే ప్రయత్నం చేస్తే.. ఈ విషయాన్ని పెద్దదిగా చేసి నానా భీభత్సం చేశారని, పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రభుత్వాన్ని కూల్చి వేయాలన్న దశకు వెళ్ళారని, ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. కోర్టును మభ్యపెట్టి స్టే తెచ్చుకున్నారంటూ 14 మందికి కోర్టు లక్ష రూపాయల చొప్పున జరిమానా వేసిందని రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాంబాబు మీడియాతో మాట్లాడారు.
విజయసాయి రెడ్డి సెల్ ఫోన్ పోయిందని కంప్లయింట్ ఇస్తే.. ఆ ఫోన్ లోనే చాలా కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయని చెప్పే హీనమైన స్థితికి టిడిపి నేతలు వెళ్ళడం దురదృష్టకరమన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా విపక్షాల వ్యవహారం ఉందన్నారు.
చిట్ ఫండ్ యాక్ట్ ను పాటించని వారిపై అధికారులు సోదాలు చేసి కేసులు పెడుతున్నారని, మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అనేక అక్రమాలకు పాలడుతున్నట్లు తేటతెల్లమైందని రాంబాబు అన్నారు. ఈ విషయాన్ని ఓ రెండు పత్రికలు తప్ప మిగిలిన పేపర్లు, ఇంగ్లీష్ మీడియా కూడా ప్రచురించిందని చెప్పారు. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు ఎవరైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉందన్నారు.
చిట్ లు నిర్వహించడం తప్పు కాదని, కానీ ఆ చిట్ పేరిట వసూలు చేసే సొమ్మును ఓ ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి దానిలో జమ చేయాలని, ప్రతి చిట్ కోసం విడివిడిగా ప్రత్యేక ఖాతా కూడా ఓపెన్ చేయాలని ఇదే చట్టంలో ఉన్న నిబంధన అని… అయితే మార్గదర్శి కంపెనీ ఒకే అకౌంట్ ఓపెన్ చేసిందని ఇది అక్రమమని రాంబాబు వివరించారు. చిట్ లు పాడుకున్న వారికి కూడా షూరిటీల పేరుతో సొమ్ము ఇవ్వకుండా నాలుగైదు నెలలపాటు తిప్పుతున్నారని, దీనివల్ల పెద్ద ఎత్తున మార్గదర్శిలో నిధులు జమ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నిధులను తన అనుబంధ కంపెనీలకు వారు వాడుతున్నారని రాంబాబు ఆరోపించారు. తాము ఈ వ్యవహారంపై విచారణ చేస్తుంటే కక్ష సాధింపు అని చెప్పడం సరికాదన్నారు.
పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్ల సామ్రాజ్యం ఎలా ఏర్పాటు చేశారో సమాధానం చెప్పాలని రామోజీ రావును అంబటి డిమాండ్ చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరిమీదనైనా కేసులు పెడతామని స్పష్టం చేశారు. అక్రమంగా డిపాజిట్లు సేకరించబోమని కోర్టులో చెప్పి, ఇప్పటికీ సేకరిస్తున్నారని, చట్టాలకు అతీతంగా ఎవరూ వ్యవహరించినా ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎవరైనా ఖండించాల్సిందేనన్నారు.
Also Read : పవన్ భాష అభ్యంతరకరం: అంబటి