ఆర్పీ సిసోడియా అత్యంత సమర్థుడైన అధికారిగా రాజ్ భవన్ లో విధులు నిర్వర్తించారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రశంసించారు. ప్రతి అంశం పట్ల లోతైన అవగాహనతో రాజ్ భవన్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కృషి చేసారని చెప్పారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బదిలీపై వెళుతున్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియాను ఘనంగా సత్కరించి, రాజ్ భవన్ కు సిసోడియా అందించిన సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో సిసోడియా రాజ్‌భవన్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారని, ఈ సవాలును స్వీకరించి జాగ్రత్తగా పరిస్థితిని చక్కదిద్దారని కొనియాడారు. అవసరమైన కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తూ తనతో సహా, రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది భద్రతకు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. సిసోడియాకు గొప్ప భవిష్యత్తు ఉందని గవర్నర్ అన్నారు.
ఆర్.పి.సిసోడియా స్పందిస్తూ గవర్నర్ తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశమని, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక విధులకు సంబంధించిన అనేక కొత్త విషయాలను తెలుసుకోగలిగానని అన్నారు. గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సిసోడియాతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో సిసోడియాకు మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప కార్యదర్శి నారాయణ స్వామి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.