Saturday, January 18, 2025
HomeTrending Newsగుజరాత్ లో చివర దశ పోలింగ్‌ ప్రారంభం

గుజరాత్ లో చివర దశ పోలింగ్‌ ప్రారంభం

గుజరాత్ ఎన్నికల రెండో, చివర దశ పోలింగ్‌ కొద్ది సేపటి క్రితం ప్రారంభం అయింది. సోమవారం రాష్ట్రంలోని మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో 61 రాజకీయ పార్టీలకు చెందిన 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 285 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రెండో విడత ప్రచారానికి శనివారం బ్రేక్ పడగా.. పోలింగ్‌కు ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో సోమవారం ఉదయం ప్రధాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, గత ఎన్నికలలో కూడా ఇక్కడ తన ఓటు వేశారు. ఈ పోలింగ్ స్టేషన్ అహ్మదాబాద్ నగరంలోని సబర్మతి అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్‌లోని నారన్‌పురాలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటు వేయనున్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. గుజరాత్‌లోని 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీలకు ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 1న 19 జిల్లాల్లోని 89 స్థానాలకు మొదటి దశలో ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.

182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 92 సీట్లు అవసరం. గత ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు రాగా.. కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. గుజరాత్‌లో 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. అటు ఆప్ పార్టీ కూడా పోటీ చేస్తుండడంతో గుజరాత్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో పాటు గుజరాత్ ఫలితాలు కూడా రానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్