గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా చూడాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డిలతో కలిసి జిల్లాలో భారీ వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి ఆరా తీస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పక్కాగా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని, అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ప్రభావంతో వ్యాధులు ముప్పిరిగొనకుండా ముందస్తుగానే అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ కార్య స్థానంలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన కాలం నాటి ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, భోజన వసతి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.