Sunday, November 24, 2024
HomeTrending NewsCyclone: గుజరాత్ కు తుపాను హెచ్చరిక

Cyclone: గుజరాత్ కు తుపాను హెచ్చరిక

అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన బిపర్‌జాయ్‌ మరో ఆరుగంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదులుతున్నదని, ఈనెల 15 నాటికి పాకిస్థాన్, దానిని ఆనుకుని ఉన్న సౌరాష్ట్ర, కచ్‌ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం అది ముంబైకి దక్షిణంగా 600 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

బిపర్‌జాయ్‌ తుఫాను వల్ల వచ్చే ఐదు రోజులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేసింది. తుఫాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. గాలుల కారణంగా గుజ‌రాత్ వ‌ల్సాద్‌లో ఉన్న తీత‌ల్ బీచ్‌లో భారీ అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. దీంతో ఈ నెల 14 వరకు అధికారులు ఆ బీచ్‌ను మూసివేశారు. తీరప్రాంతాల్లో ఉన్న ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు అధికారులు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. కాగా, గుజరాత్‌, డామన్‌ డయ్యూ మల్స్యకారులు, నావికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సూచించింది. పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దింపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్