Periodic Stories: సాధారణంగా సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటూ ఉంటాయి. ఒకే కాలంలో కాస్త వెనక్కి వెళ్లి గతంలో ఏం జరిగిందనేది చూపిస్తుంటారు. కథను ఆసక్తికరంగా నడిపించడంలో ఫ్లాష్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ. ఈ ఎపిసోడ్ ను ఎక్కడ చెబితే బాగుంటుందో అక్కడే చెప్పాలి. లేకపోతే వర్తమానం కూడా దెబ్బతినేసి సినిమా పోతుంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ కోసం కాదు .. కథ కోసమే కాలంలో వెనక్కి వెళుతున్నారు. కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లే కథలు కొన్నయితే, కొన్ని శతాబ్దాల వెనక్కి తీసుకెళ్లే కథలు మరికొన్ని.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు‘ సినిమా మొగల్ కాలంలో నడుస్తుంది. అప్పటి కాలానికి సంబంధించిన సెట్స్ కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఇక కల్యాణ్ రామ్ హీరోగా చేసిన ‘బింబిసార’ కూడా బింబిసారుడి కాలంలో నడుస్తుంది. రాజులు .. రాజ్యాలు .. గుర్రాలు .. యుద్ధాలు అంటే మాటలు కాదుగదా మరి. అందువలన ఈ కథ కోసం ఆయన కూడా కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఇటీవల నాని చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా 70వ దశకంలో జరిగిన కథ. అప్పటి కలకత్తాలో జరిగిన ఒక అనాచారం చుట్టూ ఈ కథ నడుస్తుంది. కలకత్తా నేపథ్యంతో కూడిన సెట్స్ కోసం భారీగానే ఖర్చు చేశారు. ఇక రానా తాజా చిత్రమైన ‘విరాటపర్వం’ విషయానికి వస్తే 90ల నాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నారు. అప్పటి నక్సలిజం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రాజమౌళి రూపొందించిన ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా అదే బాటలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇలా ఇప్పుడు చాలా వరకూ కథలు గడిచిపోయిన కాలం నుంచి పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు చేయవలసిందల్లా వర్తమానాన్ని వదిలిపెట్టి గతంలోకి జారిపోవడమే!