మలయాళ సినిమా ప్రేక్షకులు సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఇష్టపడతారు. కథలో ఆత్మ ఉండాలని వారు కోరుకుంటారు. సున్నితమైన ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అసాధారణంగా అనిపించే కథలకు .. సన్నివేశాలకు వారు కాస్త దూరంగానే ఉంటారు. మలయాళ సినిమాల్లోని ఆ సహజత్వమే వారి సినిమాలపై ప్రపంచ ప్రేక్షకులు దృష్టిపెట్టేలా చేసింది. ఇటీవల కాలంలో తెలుగులో రీమేక్ చేయబడిన చాలా సినిమాలు మలయాళం నుంచి వచ్చినవే.
ఇక మలయాళ అనువాదాల సంఖ్య కూడా ఇక్కడ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపి వంటి కొందరు మలయాళ స్టార్స్ మాత్రమే ఇక్కడి ప్రేక్షకులకు తెలిసేవారు. కానీ ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు మలయాళంలోని ఆర్టిస్టులు చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈ కారణంగా కూడా మలయాళ అనువాదాలు ఇక్కడి థియేటర్స్ కి వస్తున్నాయి. అలా వస్తున్న సినిమానే ‘2018’. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్స్ కి వస్తోంది.
ఆల్రెడీ ఈ సినిమా మలయాళ ప్రేక్షకుల ముందుకు ఈ నెల 5వ తేదీన వచ్చేసింది. వసూళ్ల పరంగా అక్కడ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాను ఇక్కడ వదులుతున్నారు. 2018లో కేరళలో వచ్చిన వరదలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. అంతగా వరదలు విరుచుకుపడటానికి కారకులు ఎవరు? అనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమైంది. ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇక్కడ కూడా జెండా ఎగరేసేలానే కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.