Thursday, December 5, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంహిందూపురం కథలు- 6

హిందూపురం కథలు- 6

ప్రతి ఊళ్ళో వ్యాపారం ఉంటుంది. అలాంటప్పుడు హిందూపురం వ్యాపారం ప్రత్యేకత ఏమిటి? అని ఎవరికైనా సందేహం రావచ్చు. చింతపండు, బెల్లం, ఎండు మిర్చి, బంగారం, ఆటో ఫైనాన్స్, పట్టుపరిశ్రమ వ్యాపారాలకు హిందూపురం పెట్టింది పేరు. అయితే ఒకనాటి ఆ వ్యాపార వైభవం హిందూపురంలో ఇప్పటికీ అలాగే ఉందా అంటే ఉంది. లేదంటే లేదు.

మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా ఉండే ముఠా కక్ష్యలు హిందూపురంలో ఎప్పుడూ లేవు. (రాయలసీమ అంతా కరడుగట్టిన ఫ్యాక్షనిస్టులతో నిండిపోయినట్లు తెలుగు సినిమా పరిశ్రమ చిత్రీకరించడం వల్ల మిగతాప్రాంతాలవారికి అలాంటి అభిప్రాయం ఏర్పడింది. రాయలసీమకు అతిపెద్ద విలన్ తెలుగు సినిమా. తనను అలా చిత్రీకరించడం పట్ల మెదడులేని, తలపొగరు సినిమా పెద్దల ముందు రాయలసీమ కనీసం నిరసన అయినా వ్యక్తం చేయకపోవడం మరో విషాదం) ఆమాటకొస్తే మొత్తం రాయలసీమలోనే ఫ్యాక్షనిజం బాగా తగ్గిపోయింది. హిందూపురం పేరుకు ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది కానీ అంతా కన్నడ సంస్కృతి. హిందూపురంలో కన్నడ మాట్లాడనివారికి విలువ తక్కువ. హీనపక్షం కన్నడ భాష అర్థమైనా కావాలి. ఉదయాన్నే బెంగళూరు వెళ్లి పనులు చక్కబెట్టుకుని సాయంత్రానికి హిందూపురం వచ్చేవారు ఇప్పటికీ ఉన్నారు. హిందూపురం ఊరి మధ్యలో ప్రధానమైన దారి పేరు బెంగళూరు రోడ్డు. హిందూపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్ దాటగానే కర్ణాటక వస్తుంది. బెంగళూరు మరీ రెండు గంటల దూరంలో ఉండడమే హిందూపురానికి బలమూ, బలహీనత. బెంగళూరులో వర్షం పడితే హిందూపురానికి జలుబు చేస్తుందని స్థానికులు కాయిన్ చేసిన సామెత.

హిందూపురం వ్యాపారానికి పునాదులు వేసింది వైశ్యులు. కొన్ని దశాబ్దాలపాటు అప్రతిహతంగా వ్యాపారాలను వారే నిర్వహించారు. సంపాదనతో పాటు ధార్మిక చింతన, దానధర్మాలతో హిందూపురం అభివృద్ధిలో వైశ్యులపాత్ర చాలా ఉంది. విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సేవాసంస్థలు, క్రీడా క్లబ్బులు ఇలా అన్నిటి ఏర్పాటులో వారి ప్రమేయం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండి తీరుతుంది. ఆ వ్యాపారాల్లోకి ఇతర కులాలు, మతాలవారు కూడా ప్రవేశించాక ఒకనాటి పట్టు ఇప్పుడు లేదు. కొందరు శాశ్వతంగా ఊరొదిలి బెంగళూరులో వ్యాపారాలు మెదలుపెట్టారు. కొందరు వ్యాపారం వదిలేసి ఇతర వృత్తుల్లోకి మారిపోయారు.

హిందూపురంలో ఆటో ఫైనాన్స్ కంపెనీలు కొన్ని వందలు ఉండేవి. జనరల్ ఫైనాన్స్ కంపెనీలు లెక్కే లేదు. ఆర్థిక సరళీకరణల 1990 నాటికే వీటి రిలవెన్స్, అవసరం, ప్రాధాన్యం తగ్గిపోతూ వచ్చింది. ప్రయివేటు బ్యాంకులు ఇళ్ళకొచ్చి కోట్లకు కోట్ల అప్పులిస్తుంటే ఈ ఫైనాన్స్ కంపెనీల గుమ్మం తొక్కేవారెవరుంటారు?

హిందూపురం చింతపండు పొరుగున కర్ణాటక, తమిళనాడుతోపాటు దేశమంతా అమ్ముడుపోయేది. విదేశాలక్కూడా ఎగుమతి అయ్యేది. అత్యంత నాణ్యమైన కర్పూడి చింతపండును ఇప్పటికి హిందూపురం ఎన్ని లక్షల టన్నులు అమ్మి ఉంటుందో? బెల్లం, ఎండు మిర్చి ఒకప్పటితో పోలిస్తే తగ్గింది కానీ…చింత పులుపు మాత్రం ఇప్పటికీ పైచేయిగానే ఉంది. పట్టు పరిశ్రమ కూడా పట్టుదప్పింది.

రాయలసీమలో పెళ్లిళ్లకు బంగారు కొనాలంటే ముందు ఎవరికైనా గుర్తొచ్చేది ప్రొద్దుటూరే. మేలిమి బంగారు దొరుకుతుందని, పది రూపాయలు ధర తక్కువ ఉంటుందని పేరు రావడంతో దశాబ్దాలుగా అనేక శుభ కార్యాలకు ప్రొద్దుటూరు బంగారం అమ్ముతోంది. పైసా పైసా పోపుల పెట్టెల్లో కూడబెట్టుకుని ఎంతో మురిపెంగా బస్సెక్కి వచ్చే ఎందరో మహిళలకు ప్రొద్దుటూరు ఎన్నో ఏళ్లుగా బంగారు నగ ఇచ్చి పంపుతోంది. ప్రొద్దుటూరు తరువాత బంగారానికి హిందూపురమే పెద్ద దిక్కు.

హిందూపురం ముదిరెడ్డిపల్లె చేనేతకు పెద్ద చరిత్ర ఉంది. హ్యాండ్లూమ్ కాస్త పవర్లూమ్ అయ్యాక ఆ వైభవం మసకబారింది. నేతవృత్తిలో ఉండలేక…మరో వృత్తిలో స్థిరపడలేక ముదిరెడ్డిపల్లె పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. నేతకంటే నేసిన వస్త్రాలు అమ్మే వ్యాపారంలోకి దిగి ముదిరెడ్డిపల్లె కొంతకాలం వెలిగింది కానీ…పెద్ద పెద్ద నగరాల్లో షో రూములవారికి చీరలిచ్చి…వారు ఎన్నాళ్లయినా డబ్బులివ్వక నెమ్మదిగా ముదిరెడ్డిపల్లె చితికిపోయింది. ఇంకో వృత్తి చేతగాక ఇందులో కూరుకుపోతున్న ముదిరెడ్డిపల్లెలో లోకం శుభకార్యాలకు బట్టలు తయారవుతుంటాయి కానీ…వారి ఇళ్ళల్లో శుభకార్యాలకు మాత్రం అప్పులు చేయకతప్పని పరిస్థితి.

ఒక్కో వ్యాపారి ఇంట్లో చింతపండు, బెల్లం, మిర్చి మూటలు నిండి మనిషి కాలు తీసి కాలు పెట్టడానికి వీలులేని కాలాలు చూశాను. లారీలకు లోడ్ ఎక్కించడానికి కూలీలు దొరకనంత డిమాండు ఉన్న రోజులు చూశాను. గల్లాపెట్టె ముందు డబ్బులు లెక్కపెట్టుకోవడానికి చెయ్యి ఖాళీలేని కాలాలు చూశాను. లంకంత ఇంట్లో ఖాళీ గోనె సంచులు మిగిలిన కాలాలూ చూశాను. లోకానికి చింతపండు, బెల్లం, మిర్చి గుట్టలు గుట్టలుగా పేర్చి అమ్మిన వ్యాపారులు తమ ఇళ్ళల్లో వంటకు కిరాణా షాపుల్లో గ్రాముల లెక్కన కొన్న కాలాలూ చూశాను. గల్లాపెట్టెల్లో చిల్లరపైసల గలగలలు కూడా వినపడక బెంగళూరులో లెక్కలు రాసే ఉద్యోగాల్లో చేరిన కాలాలూ చూశాను.

మొత్తంగా హిందూపురానిది ఇప్పుడు వ్యాపారమో! అవ్యాపారమో! తెలియని అయోమయస్థితి.

రేపు:-
హిందూపురం కథలు-7
“ఎన్ టీ ఆర్ నియోజకవర్గం”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్