Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకలవరపెడుతున్న కొత్త రోగం

కలవరపెడుతున్న కొత్త రోగం

New Virus: జబ్బు నయం కావాల్సిన చోటే జబ్బుబారిన పడడమంటే ముమ్మాటికీ ఆందోళనకరమే! కానీ అదే నిజమంటున్నారు ప్రఖ్యాత వైద్యులు. అంతేకాదు కోవిడ్ సమయంలో ఒకరినుంచి ఇంకొకరికి వైరస్ ఎలా వ్యాపించిందో, ఆ తర్వాత శివాలెత్తిన బ్లాక్ ఫంగస్ ఎందరిని అతలాకుతలం చేసిందో ఈ సమాజమంతా చూసింది. అయితే అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ప్రమాదకరమేనన్న చర్చ ఇప్పుడు ప్రముఖ వైద్యులు లేవనెత్తతున్న క్రమంలో ఆసుపత్రికెళ్తే రోగమా? మరి ఆసుపత్రుల నిర్వహణ అసలెలా ఉండాలి అనే చర్చకు తెరతీసింది.

రోగి ఒక్కడే ఆసుపత్రికెళ్లే సందర్భాలు ఎంతైనా తక్కువే.  చిన్న చిన్న సర్జరీల నుంచి అనుకోని విపత్తులెదురైనప్పుడు రోగుల వెంట  బంధువులు ఉండాల్సిందే. కానీ అలా రోగి వెంట ఆసుపత్రికెళ్లిన పాపానికి..  వారు కూడా రోగాలకు గురవ్వడం విస్మయం కలిగించే అంశమే. కానీ, ఆసుపత్రులే ఇన్ఫెక్షన్లకు మూల కారకాలన్నది నిపుణులు చెబుతున్న మాట.

అయితే ఆ ఆసుపత్రుల నిర్వహణను బట్టి ఇన్ఫెక్షన్స్ నియంత్రణ ఆధారపడి ఉంటుంది. ఇవాళ పట్టణాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆసుపత్రుల్లో ఒకటీ, అరా ఎక్కడైనా ఉంటే చెప్పలేంగానీ, ఆ స్థాయి నిర్వహణను మనం ఊహించలేం. అంత అవగాహన ఉన్నట్టుగా కూడా కనిపించదు.  ఒకవేళ అంత అవగాహన ఆసుపత్రి యాజమాన్యాలకు, సిబ్బందికి ఉన్నాగానీ, జనం నుంచి డబ్బులు దోచుకోవడమే తప్ప, జనం బాగును పట్టించుకునే పరిస్థితి ఉంటుందా అన్నదీ నేటి మెడికల్ మాఫియా యుగంలో ప్రశ్నార్ధకమే!

ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో సిటీలే కాదు, సెకండ్ గ్రేడ్ సిటీలుగా వృద్ధి చెందుతూ, అర్బనైజేషన్ పెరిగిపోతున్న క్రమంలో ప్రతీ మండల కేంద్రం నుంచీ జిల్లా కేంద్రాల వరకూ వైద్యం ఓ పచ్చి వ్యాపారం. అలా అని వైద్యులందరినీ నరరూప రాక్షసులనడం సమంజసం కాదు,  ఎందుకంటే అందులోనూ వైద్యనారాయణులూ ఉంటారు కాబట్టి!  కానీ, అధికస్య అధికం ఇవాళ మనం ఏ ఊళ్లో చూసినా  వైద్యం ఎంత వ్యాపారమైందో, ఓ వైద్యశాలకు అనుబంధంగా వెలిసే మెడికల్ షాప్,  డయాగ్నస్టిక్ సెంటర్లను చూసినప్పుడు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వైద్యాన్ని ఇంతగా వ్యాపార వస్తువుగా మార్చుకున్న యాజమాన్యాలు,  వైద్యశాలకు వస్తే సోకే ఇన్ఫెక్షన్ల విషయంలో మాత్రం అప్రమత్తంగా లేకపోవడం శోచనీయం.

ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వంటివాళ్లే ఈ విషయాన్ని కుండబద్ధలు కొడుతున్నారు. పేషంట్స్ తో పాటు తోడుగా వచ్చేవారిలో పదిశాతం మంది ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్స్ కు గురై కొత్త రోగాల బారిన పడుతున్నారని  వెల్లడించారు.  అందుకే హాస్పిటల్ మేనేజ్ మెంట్స్… కాసుల దందా కోసమే కాకుండా హాస్పిటాలిటీ,  భద్రతా  ప్రమాణాలు,  పరిశుభ్రత లాంటివి కూడా ముఖ్యమేనంటున్నారు. అందుకే ఈ అంశంపై  మూడురోజుల సదస్సునే నిర్వహించారంటే… ఈ విషయం ఎంత ఆందోళన కలిగిస్తుందో తెలియజేస్తోంది.

నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌వో) కూడా దేశంలో ఎక్కువ జబ్బులు ఇన్ఫెక్షన్ల ద్వారానే వస్తున్నాయని గతంలోనే వెల్లడించింది. ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 31.4 శాతం మంది ఇన్ఫెక్షన్‌ సంబంధిత రోగాలతో తిరిగి వెళ్తున్నారనీ తేల్చిచెప్పింది. ఇందులో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది.

అమెరికా, యూకే వంటి అత్యాధునిక వైద్యసదుపాయాలు కల్గిన దేశాల్లో కూడా ఈ అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్న క్రమంలో… కనీసం శుభ్రత కూడా పట్టించుకోని మన స్థానిక ఆసుపత్రులను చూసినప్పుడు ఇంకెంత అవసరమో పట్టిచూపుతోంది. అందుకే ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో… ఇన్ఫెక్షన్ డిసీజ్ నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగడంతో పాటు… మైక్రోబయలాజిస్టులు, వైద్యులు, సర్జన్లతో కూడిన పటిష్ఠమైన కమిటీని ఏర్పాటు చేశామని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సదస్సులో చెప్పుకురావడం… ఇవాళ వైద్యం పచ్చి వ్యాపారంగా మారిన నేపథ్యంలో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యతను కూడా మిగిలిన వైద్య సమాజానికి గుర్తు చేసేదే!

అయితే అంత బాధ్యతాయుతంగా ఎవరు పట్టించుకుంటారు? అమలు చేస్తారా? ఇలాంటివి సదస్సులకే పరిమతమా? అన్న ప్రశ్నలు ఉదయించడం.. కేవలం వైద్యాన్ని వ్యాపారంగా మాత్రమే చూస్తున్న రోజుల్లో సహజమే! కానీ, ఇప్పుడు పదిశాతమున్నది… రేప్పొద్దున ఇంకా పెరిగే అవకాశమూ ఉండవచ్చూ.. అదే రాబోయే రోజుల్లో మెడికల్ వ్యవస్థలో ఓ విపరిణామంగా మారి… ఇప్పటికే ఆసుపత్రులంటే దోపిడీ కేంద్రాలుగా చూస్తున్న కాలంలో… జనాల ఆరోగ్యాల్ని గాలికొదిలేసే నాణ్యతలేని ఎందరో డాక్టర్లు సర్డరీలు చేసి కడుపుల్లోనే కత్తెరలను మర్చిపోతున్న కాలంలో.. ఈ ఇన్ఫెక్షన్ ఆందోళన కూడా మరింత పెరిగితే… జనం హాస్పిటల్ అంటే మరింత భయభ్రాంతులకు గురికావడం మాత్రం ఖాయం.

అయితే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఏంచేయవచ్చు అనే రీసెర్చ్ జరగాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన ఐఐటీ విద్యార్థి యతీ గుప్తా… తన ప్రొఫెసర్ సామ్రాట్ ఉపాధ్యాయ్ నేతృత్వంలో గతంలో దీనికి విరుగుడుగా… వైరస్ లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్స్ సోకకుండా నూలుతో ఓ ప్రత్యేక వస్త్రాన్ని తయారుచేశారు. వీరు తయారుచేసిన ఇన్ఫెక్షన్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ రెండు గంటల వ్యవధిలో 99 శాతం వ్యాధికారక క్రిములను చంపేస్తుంది కూడాను!

New Infections

మెడికల్ టెక్నాలజీ ఆధారంగా… టెక్స్ టైల్ కెమికల్ ప్రాసెసింగ్ విధానంలో తయారుచేసిన ఈ నూలు వస్త్రాలు ధరిస్తే… ఆసుపత్రుల నుంచి రోగుల బంధువులను ఇన్ఫెక్షన్స్ రహితంగా… మరింత సురక్షితంగా ఉంచొచ్చట. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందితో పాటు… ఆసుపత్రుల్లో వాడే బెడ్ షీట్స్ కు, రోగులకు వేసే యూనిఫామ్స్ కి కూడా వాడేవిధంగా దీన్ని డెవలప్ చేశారు. అయితే ఇలాంటి కొత్త పరిశోధనల అవసరం… భీతిగొల్పుతున్న ఇన్ఫెక్షన్స్ కాలంలో కింకర్తవ్యంగా భావించాల్సిన సమయమిది. రాబోయే రోజుల్లో ఆసుపత్రులకు వర్తించే ప్రధానమైన నిబంధనల్లో… ఇన్ఫెక్షన్స్ ను నివారించే అంశమూ ఎంత ప్రధానమో… వైద్యనిపుణుల సదస్సులూ పట్టిచూపుతున్నాయి.

-రమణ కొంటికర్ల

ఇవి కూడా చదవండి: 

వైద్యో నారాయణో హరీ!

RELATED ARTICLES

Most Popular

న్యూస్