Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశబ్ద కాలుష్యం

శబ్ద కాలుష్యం

No Horn Pls:  ‘పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు… పీపీపి నొక్కేస్తాడు స్కూటర్ సుబ్బారావు… ఛీ పాడు పొరికోళ్లంతా నా ఎన్కే పడ్తారు.. ఏందీ ఈ టెన్షన్… యమ్మా టెన్షన్‘  అంటూ ఓ తెలుగు సినిమాలో క్యాబరే డ్యాన్సర్ పాడుకున్న పాటను… ఇప్పడు పువ్వాయ్ పువ్వాయ్ అనే ఓ ఆటో అప్పారావు… పీపీపి అని నొక్కేసే ఓ స్కూటర్ సుబ్బారావు… ఛీ పాడు ఈ పోలీసోళ్లంతా మా ఎన్కే పడ్తారు… ఏందీ ఈ టెన్షన్.. యమ్మా టెన్షన్ అని రివర్స్ లో పాడుకునే రోజులు దగ్గర పడుతున్నాయి. ఎందుకంటే  హైదరాబాద్ ను హాంకింగ్ ఫ్రీ సిటీగా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి గనుక! అంటే హారన్ల మోతకు ఫుల్ స్టాప్ పెట్టే రోజులిక దగ్గర్లోనే ఉన్నాయి.

వాస్తవంగా హార్న్ మోతెందుకు? ఎవరైనా అడ్డువచ్చినప్పుడో, లేక ఏవైనా గల్లీల మూల మలుపుల మీద ఎదురుగా ఏవైనా బండ్లు వస్తాయని భావించినప్పుడో,  ఏవైనా అర్జంటు పనులున్నప్పుడో  వాడడం కోసం…  కానీ చేతిలో ఉంది కదా అని ఇష్టారీతిన శష్యాబ్ద కాలున్ని సృష్టిస్తున్న వేళ పోలీసుల యత్నం ఎంతవరకూ సఫలీకృతమవుతుందన్నది పక్కనబెడితే… ఓ అడుగు ముందుకు పడటం మాత్రం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడంతా ఆర్టీఫిషియల్  ఇంటెలిజెన్స్ తో పనులు చక్కబెడుతున్న కాలంలో,  హాంకింగ్ ఫ్రీ సిటీగా మార్చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు కూడాను! ఎందుకంటే ఇప్పటికే ముంబైలో ఇలాంటి ప్రయోగం సక్సెస్ అయింది.

 Hyderabad Traffic Police

ముఖ్యంగా ట్రాఫిక్ కూడళ్లలో ఒకర్ని తప్పించి ఇంకొకరు ముందుకెళ్లాలన్న తలంపుతోనో… లేక, కాస్త పెద్ద నగరాలైతే మళ్లీ ఎక్కడ రెడ్ లైట్ పడి ఆగిపోతామోనన్న ఒకింత టెన్షన్ తోనో చేసే హారన్ల మోత చెవులకు చిల్లులు కొట్టేది! దానికి ముంబై ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ సక్సెస్ ఫుల్ గా ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. అదే  ఇప్పుడు హైదరాబాద్ వంటి పలు నగరాలకు ఓ మోడల్ లా నిలుస్తోంది. ముంబై ట్రాఫిక్ కూడళ్లలో ఎర్ర రంగు పడ్డాక హారన్లు  మోగిస్తే, ఆ మోతకు పచ్చరంగు లైట్ వెలగడం మరింత ఆలస్యమవుతుంది. ఎర్రరంగు వాహనదారులను అడ్డుకుంటూనే ఉంటుంది.  దాంతో మరింత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.  అందుకే లోలోపల ఎంత కోపమున్నా హార్న్ వేస్తే జరిగే మరింత వెయిట్ అండ్ వాచ్ ఎపిసోడ్ కళ్లముందు మెదిలి.. హారన్ల మోతకు కాసింత చెక్ పడింది. అనవసరంగా హార్న్ వేసినప్పుడల్లా ఎంత సమయం వేచి చూడాల్సి వస్తుందో కూడా నగరవాసుల్లో వీడియోల రూపంలో అవగాహన కల్పిస్తోంది ముంబై ట్రాఫిక్ పోలీస్ విభాగం. అయితే ఈ విషయం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్  ను ఆకట్టుకుని హైదరాబాద్ లోనూ ఈ విధానం అమలు చేయాలని సుమారు రెండేళ్ల క్రితమే ఆదేశించినా ఇప్పటికిగాని ఓ ముందడుగు పడలేదు.

అయితే మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను అభినందించాల్సిన విషయమేంటంటే… భయం కన్నా బాధ్యతే గొప్పదనే విషయాన్ని నమ్మి ముందు ఆ దిశగానే అడుగులు వేశారు. కానీ, ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపుగాదన్నట్టుగా… వాళ్ల ప్రయోగం కాస్తా బెడిసి కొట్టిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడబడితే అక్కడ హెల్మెట్ లేదని, సిగ్నల్ జంపింగ్సని, అతివేగమని, లైసెన్స్, ఆర్సీ బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటివి లేవని జరిమానాలు వేయడానికన్నా… పౌరులకు సమాజం పట్ల తమ బాధ్యతేంటో తెలిపేలా అవగాహన కల్పించాలని.. తద్వారా చైతన్యం తీసుకురావాలనీ సంకల్పించారు. కానీ, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఆలోచించే లోకంలో… చెడి మూర్ఖుల మనస్సు రంజింపజేయలేక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ను సెలెన్స్ సిటీగా… హార్న్ ఫ్రీ సిటీగా… ఓ నిశ్శబ్ద నగరంగా మార్చడమంటే మన ట్రాఫిక్ పోలీసులకు నిజంగా ఓ సవాలే మరి! అయితే ఇప్పటికే నిబంధనలనతిక్రమించినవారి వాహనాల ఫోటోలను ఆన్ లైన్ లో అప్ లోడ్  చేస్తూ.. పోలీసులకు కాస్త పనిఒత్తిడి తగ్గిన నేపథ్యంలో… ఒకవేళ ముంబై తరహా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ గనుక హైదరాబాద్ కు వస్తే.. కచ్చితంగా ఎంతో కొంత ఫలితమైతే కనిపిస్తుంది.

ఇప్పటికే శబ్దకాలుష్యంతో ఎలాంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి మొదలుకుంటే పలు సర్వే సంస్థలూ పేర్కొంటున్నాయి. దీనివల్ల చెవుడు, హైపర్ టెన్షన్, ఒబెసిటీ, డయాబెటీస్, హార్ట్ ఎటాక్స్ వంటివాటికీ అవకాశముంటుందన్నది వైద్యనిపుణుల హెచ్చరిక. అంతేకాదు డబ్ల్యూహెచ్వో సర్వే ప్రకారం ప్రశాంతంగా ఉండే ఊర్లల్లో ఉండేవారికన్నా నగరాల్లో జీవించేవారికి ఓ పదీ, ఇరవై ఏళ్ల ముందే హియరింగ్ సమస్యలు తలెత్తున్నట్టు సమాచారం.

 Hyderabad Traffic Police

చైనాలోని గాంగ్జ్వౌ పట్టణం శబ్దకాలుష్యంలో ముందువరుసలో ఉండగా.. న్యూయార్క్, లండన్ వంటి నగరాలతో పాటు… మన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, లక్నో వంటి నగరాలూ ఆ వరుసలోకి రావడం ఇప్పుడు ఆందోళన రేకెత్తించే విషయం. అయితే వియన్నాలో తక్కువ శబ్ద కాలుష్యం ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. మొత్తంగా ట్రాఫిక్ నియంత్రణలో చాలా కీలకమై, ఎన్నో జీవితాలను చెవిటిగా మారుస్తూ… తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ, రకరకలా వ్యాధులకు కూడా కారణమవుతున్న శబ్దకాలుష్యాన్ని నియంత్రించి… సౌండ్ ఫ్రీ సిటీగా… నిశబ్ద భాగ్యనగరంగా హైదరాబాద్ ను మార్చాలంటే మాత్రం కేవలం అధికారిక వ్యవస్థపైనే ఆ భారాన్ని పెట్టకుండా…  ఈమధ్య వచ్చిన ఓ తెలుగు సినిమాలో హీరోలా ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించే రాజకీయ సంకల్పం కూడా తప్పనిసరి. మరి ఆ రాజకీయ సంకల్పం.. అధికారిక అమలుతీరు వెరసి… హైదరాబాద్ హాంకింగ్ ఫ్రీ సిటీగా మారితే.. నిజంగా నేటి వ్యవస్థలో అది కచ్చితంగా ఓ బిగ్ అఛీవ్ మెంటే!

-రమణ కొంటికర్ల

ఇవి కూడా చదవండి: 

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్