కామన్ వెల్త్ క్రీడల్లో దేశం తరఫున ఆడలేకపోవడం తనకూ బాధగా ఉందని జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా వ్యాఖ్యానించాడు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించి, ఇటీవలే అమెరికాలో ముగిసిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో రజత పతకం సంపాదించిన చోప్రా రేపటి నుంచి ఇంగ్లాండ్, బర్మింగ్ హామ్ లో ఆరంభం కానున్న కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే గజ్జల్లో గాయం కారణంగా తాను బర్మింగ్ హామ్ వెళ్ళలేక పోతున్నట్లు నీరజ్ చోప్రా నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే.
నీరజ్ దీనిపై నేడు ఓ ట్వీట్ చేశాడు. “కామన్ వెల్త్ క్రీడల్లో దేశం తరఫున ఆడలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నా, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో నా నాలుగో ప్రయత్నం తరువాత హఠాత్తుగా గజ్జల్లో నొప్పి మొదలైంది. నిన్న అమెరికాలో వైద్యులు ఈ గాయంపై పరీక్షలు నిర్వహించారు. గజ్జల్లో ఓ నరం కొంత స్ట్రెయిన్ అయినట్లు నిర్ధారించి, కొన్ని వారాలపాటు తగిన విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ విషయమై ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా, ఇతర క్రీడా సంస్థల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి, చివరకు వైదొలగాలని నిర్ణయించుకున్నా” అని పేర్కొన్నాడు.
“కొంత విశ్రాంతి తరువాత మళ్ళీ సాధన మొదలు పెడతా, నాపై అభిమానం, ప్రేమ చూపుతున్న సోదర భారతీయులకు ధన్యవాదాలు, బర్మింగ్ హాం లో పాల్గొంటున్న నా సహచర ఆటగాళ్లకు అభినందనలు” అని ప్రకటనలో వెల్లడించాడు.
2018లో ఆస్ట్రేలియా లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడం గమనార్హం.