ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైన వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. పెద్ద పెద్ద బ్యానర్లు కూడా వెబ్ సిరీస్ లు నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇంచుమించు సినిమా క్వాలిటీతో వెబ్ సిరీస్ లను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిల్ రారాజు ప్రొడక్షన్లో ‘ATM’ అనే వెబ్ సిరీస్ నిర్మితమైంది. హరీశ్ శంకర్ కథను అందించిన ఈ వెబ్ సిరీస్ కి చంద్రమోహన్ దర్శకత్వం వహించాడు.
ఈ నెల 20వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రీ లాంచ్ ఈవెంటును నిన్న రాత్రి నిర్వహించారు. ఈ వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. “ఈ వెబ్ సిరీస్ ను చంద్రమోహన్ చాలా బాగా తీశాడు. నేను తీసినా అంత బాగా తీసేవాడిని కాదేమో అనిపించింది. ప్రతి పాత్రను చాలా గొప్పగా మలిచాడు. ప్రధానమైన నాలుగు పాత్రలు కూడా నాలుగు పిల్లర్స్ లా అనిపిస్తాయి. అందరూ కూడా చాలా బాగా చేశారు” అన్నారు.
“రెండున్నర గంటల కంటెంట్ రాబట్టడానికి నాకు 100 రోజులకు పైన పడుతుంది. అలాంటిది నాలుగు గంటల నిడివి కలిగిన ఈ కంటెంట్ ను 50 రోజుల్లో షూట్ చేశాడంటే అది చంద్రమోహన్ ప్రత్యేకతనే అని చెప్పాలి. అది అతని సక్సెస్ గానే ఒప్పుకోవాలి. నేను .. దిల్ రాజు ఓటీటీకి రావడాన్ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అలాంటివి పట్టించుకుంటే ఇక్కడి వరకూ వచ్చేవాళ్లమే కాదు. సినిమాతో పోల్చుకుంటే ఓటీటీ ద్వారా మాకు వచ్చేది తక్కువే .. అయినా ప్యాషన్ తో వచ్చాము” అంటూ చెప్పుకొచ్చారు.