మరోసారి కాపుల ఓట్లను మూటగట్టి హోల్ సేల్ గా చంద్రబాబు కు అమ్మేసే విధంగా దత్తపుత్రుడి రాజకీయాలు కనబడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ‘బాబు లాగా తనకు దత్తపుత్రుడు, మీడియా అండ లేకపోవచ్చు, కానీ మీ అందరి దీవెనలు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయని కచ్చితంగా చెబుతున్నా’ అంటూ వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం లబ్ధిదారుడికి నేరుగా అందిస్తోన్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డిబిటి) కావాలో, గత చంద్రబాబు హయంలో సాగిన దోచుకో –పంచుకో- తినుకో (డిపిటి) కావాలో ఆలోచించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న తమ పాలన కావాలో కేవలం బాబు, దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడికి మేలు జరిగే ఆ పాలన కావాలో అలోచించాలన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో వైఎస్సార్ కాపునేస్తం పథకం కింద కాపు మహిళలకు ఆర్ధిక సాయాన్ని బటన్ నొక్కి లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు పై కూడా జగన్ దుయ్య బట్టారు. నిన్న ఓ పేపర్ పట్టుకొని హుదూద్ సమయంలో తాను ప్రతి ఇంటికీ తక్షణ సాయంగా నాలుగు వేల రూపాయలు ఇచ్చానని బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. ఆ సమయంలో తాను కూడా 11రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారని, కానీ నాడు ఇచ్చింది పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడక్కడా 10కేజీల రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చారని, తిత్లీ తుఫాను సమయంలో కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కానీ తమ హయాంలో ఎక్కడ ఆపద వచ్చినా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులను మొహరిస్తున్నామని, వెంటనే ప్రతి ఇంటికీ రెండు వేల రూపాయల తక్షణ సాయం, 25 కిలోల రేషన్ ఇస్తున్నామన్నారు. ఇటీవలి గోదావరి వరదల్లో కూడా ఆరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను అప్రమత్తం చేసి యుద్ద ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. బాబు తన పర్యటనలో తనకు సహాయం అందలేదని కనీసం ఒక్క లబ్ధి దారుడితో కూడా చెప్పించలేకపోయారని సిఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే ధీమాలో వారున్నారని, కానీ ఇంటింటికీ మంచి చేశానన్న చిత్తశుద్ధి, ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు తోడుంటారన్న భరోసా, దేవుడి దీవెనల మీద నాకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు విజ్ఞప్తి మేరకు ఏలేరు ఫేజ్-1 కోసం రూ. 142కోట్లు, ఫేజ్-2 కోసం మరో 150 కోట్ల రూపాయలు, పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు చెరో 20కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు.
Also Read : బాగా పనిచేశారు, అభినందనలు : సిఎం జగన్