Icc T20 Wc England Beat Sri Lanka By 26 Runs :
ఐసీసీ టి-20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ దూసుకుపోతోంది. నేడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 26 పరుగుల తేడాతో గెలుపొంది వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్ గా మలిచి ఈ టోర్నీలో సెంచరీ కొట్టిన మొదటి ఆటగాడిగా రికార్డు సాధించాడు.
షార్జా క్రికెట్ స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 13 పరుగులకే ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ (9) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే వన్ డౌన్ లో వచ్చిన డేవిడ్ మలాన్ (6) కూడా పెవిలియన్ చేరాడు. వెంటనే ఈ టోర్నీలో బాగా రాణిస్తోన్న జానీ బెయిర్ స్టో డకౌట్ అయ్యాడు. ఇంగ్లాండ్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్, కెప్టెన్ మోర్గాన్ లు నాలుగో వికెట్ కు 112 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. మోర్గాన్ 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి 19వ ఓవర్లో ఔటయ్యాడు, 19 వ ఓవర్ ముగిసే నాటికి 87 పరుగులతో క్రీజులో ఉన్న బట్లర్ చివరి ఓవర్లో 14 పరుగులు చేసి తన కెరీర్ లో మొదటి టి 20 సెంచరీ సాధించాడు. శ్రీలంక బౌలర్లలో హసరంగ మూడు, చమీర ఒక వికెట్ పడగొట్టారు.
164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మొదటి ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. నిశాంక(1) రనౌట్ అయ్యాడు. మంచి ఊపు మీద ఉన్న చరిత్ ఆసలంక (21)ను నాలుగో ఓవర్లో ఆదిల్ రషీద్ అవుట్ చేశాడు. ఆరో ఓవర్లో మరో ఓపెనర్ పెరీరా(7)ను కూడా రషీద్ అవుట్ చేసి లంక టాపార్డర్ ను కుప్పకూల్చాడు. ఫెర్నాండో-13; రాజపక్ష-26 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ షనుక, హసరంగా కలిసి ఆరో వికెట్ కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి లంక శిబిరంలో ఆశలు చిగురించారు. అయితే ఈ జోడీని 17వ ఓవర్లో లివింగ్ స్టోన్ విడదీయడంతో ఇంగ్లాండ్ కుదుటపడింది. హసరంగ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. మరుసటి ఓవర్లోనే షనుక(26) కూడా అవుట్ అయ్యాడు. 19 ఓవర్లలో 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్ తలా రెండు వికెట్లు, లివింగ్ స్టోన్, క్రెగ్ ఓక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
సెంచరీ సాధించి అజేయగా నిలిచిన ఇంగ్లాండ్ ఓపెనర్ బట్లర్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Must Read :ఇంగ్లాండ్ లో భారతీయ జనగణన గుర్తులు