నమీబియా జట్టు ఐసిసి టి-20 వరల్డ్ కప్ సూపర్ 12లో చోటు సంపాదించింది. నేడు జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్ పై పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి గ్రూప్-ఏ లో రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్ ఏ లీగ్ దశ మ్యాచ్ లు నేటితో ముగిశాయి, శ్రీలంక, నమీబియా జట్లు సూపర్ 12 కు అర్హత సంపాదించాయి.
ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్న గ్రూప్-2లో నమీబియా చోటు దక్కించుకోగా… ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఉన్న గ్రూప్-1 లో శ్రీలంక చేరింది.
షార్జా క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ ఐర్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్-38; కెవిన్ ఒబ్రెయిన్-25; కెప్టెన్ ఆండ్రూ బాల్బిరిన్-21 మాత్రమే రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రైలింక్ మూడు, డేవిడ్ వీస్ రెండు, స్మిత్, బెర్నార్డ్ చెరో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని నమీబియా 18.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. కెప్టెన్
గెర్హార్డ్ ఎరామాస్-53; డేవిడ్ వీస్-28 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు ఓపెనర్లు క్రేగ్ విలియమ్స్-15; జానే గ్రీన్-24 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు వికెట్లూ ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ క్యాంపర్ కే దక్కాయి.
బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన డేవిడ్ వీస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.