ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించనుందా? ఏడాది నుంచి సాగుతున్న ఈ యుద్ధానికి పరిష్కార మార్గం చూడకుండా… అమెరికా పశ్చిమ దేశాలు ఇంకా వైషమ్యాలు ఎగదోసే ప్రయత్నాలే చేస్తున్నాయి. తాజాగా ఈయు కూటమి నుంచి మరింత ఆయుధ సంపత్తి ఉక్రెయిన్ కు సమకూరినట్టు సమాచారం. మరోవైపు అమెరికా దొంగచాటుగా ఆయుధ సరఫరా చేస్తూనే ఉంది.అగ్ర రాజ్యం దాని మిత్ర దేశాల సహకారం వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు గోధుమ, వంట నూనేలతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఉక్రెయిన్, రష్యా దేశాలు సరఫరా చేస్తున్నాయి. ఈ రెండు దేశాల నుంచి సరఫరా అడ్డుకోవటం ద్వారా తమ ఉత్పత్తులకు గిరాకీ పెంచుకోవచ్చనే కుటిల నీతితో కార్పొరేట్ కంపెనీలు లాబీయింగ్ చేస్తున్నాయని ఒక విశ్లేషణ ఉంది. అందులో భాగంగానే ఉక్రెయిన్ – రష్యా గొడవలకు రాజీ మార్గం చూడకుండా అమెరికా, యూరోప్ దేశాలు మరింత రెచ్చగొడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
ఆఫ్రికాలో ఆహార సంక్షోభం ఏర్పడితే వారికి సాయం చేసే పేరుతో అక్కడి సహజ సంపద చేరబట్టాలని పశ్చిమ దేశాలు చూస్తున్నాయని, గతంలో యుద్దాల ద్వారా ఆఫ్రికా దేశాలను ఆక్రమించి అక్కడి గనులు, సహజ సంపద కొల్లగొట్టిన అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు నయా వలస విధానం రూపంలో కొత్త మార్గంలో రానున్నాయి. ఇప్పటికే ఎన్జీవో ల ద్వారా సాయం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నాయి.
తాజాగా కార్పొరేట్ కంపనీలు రంగంలోకి దిగాయి. పశ్చిమ దేశాల ఆహార అలవాట్లుగా ఉండే జంక్ ఫుడ్ అందించటం ఒకటి కాగా… ఆహార సంక్షోభంతో రోగాల పాలయితే తద్వారా తమ మందుల కంపనీల అమ్మకాలు పెంచుకోవటం మరొకటి. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఇప్పటికే పశ్చిమ దేశాలు, చైనా పోటాపోటీగా ఆఫ్రికా దేశాలను జలగల్లా పీడిస్తున్నాయి. వీటి కుట్రలకు ఆఫ్ఘనిస్తాన్ ఆకలి కోరల్లో అలమటిస్తుండగా… పశ్చిమ ఆఫ్రికాలోని గినియా, ఘనా, సెనెగల్, సియర్రా లియోన్, గాంబియా, పశ్చిమ సహారా దేశాలు ఆకలితో అలమటిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండా, రువాండా, సోమాలియా దేశాలు అంతర్గత కుమ్ములాటలతో ఆర్థికంగా కుదేలయ్యాయి. సుడాన్ రావణ కాష్టంగా రగులుతోంది. చంటి బిడ్డలకు పాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న తల్లులకు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు కోడి గుడ్లు, చాక్లెట్లు, బిస్కెట్ల ఆశ చూపి తమ కామవాంచ తీర్చుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరం దక్షిణ సుడాన్ లో యుఎన్ నిర్వహిస్తుండగా కంచే చేను మేసినట్టుగా శాంతి దళాల అకృత్యాలు అన్నీ ఇన్ని కావు.
వీటన్నింటి వెనుక ఎదో ఒక స్థాయిలో అమెరికా, యూరోప్, చైనా దేశాల కుట్రలు ఉన్నాయి. ఒకరు దోచుకొని వెళ్ళగానే మరొకరు సాయం పేరుతో ఉన్నది ఉడ్చుకు వెళుతున్నారు.
అమెరికా, యూరోప్ దేశాలు ప్రత్యక్షంగా తలపదే దమ్ము లేక ఉక్రెయిన్ ద్వారా ఇబ్బంది పెడుతున్నాయని రష్యా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఉక్రెయిన్ ఆయా దేశాలు సాయం ప్రకటించిన మరుక్షణమే రష్యా క్షిపనులతో గర్జిస్తోంది. తాజాగా నిన్న రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. పలు నగరాలపై జరిపిన ఈ దాడుల్లో కనీసం 12 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్టు ప్రాథమిక అంచనా. ఉమన్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 16 మంది మృతి చెందారని, 17 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రి ఇహోర్ ైక్లెమెంకో తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. కాగా, రష్యా ప్రయోగించిన 11 క్రూయిజ్ క్షిపణులు, రెండు డ్రోన్లను కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.
-దేశవేని భాస్కర్