Friday, September 20, 2024
HomeTrending Newsపౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు గెజిట్ విడుద‌ల

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు గెజిట్ విడుద‌ల

ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు(CAA)పై కేంద్ర హోంశాఖ సోమవారం(మార్చి-11)న కీల‌క నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ రోజు నుంచి అమలులోకి వస్తుందని గెజిట్ లో పేర్కొన్నారు.  సోమవారం ఉదయం నుంచి సవరణ నోటిఫికేష‌న్ హోంశాఖ రిలీజ్ చేస్తుంద‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందే సీఏఏను అమ‌లు చేస్తామ‌ని ఇటీవ‌ల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సీఏఏ ఈ దేశానికి చెందిన చ‌ట్ట‌మ‌ని… దాన్ని ఖచ్చితంగా నోటిఫై చేస్తామ‌ని ఆయ‌న పలుమార్లు అన్నారు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల నుంచి వ‌ల‌స వ‌చ్చిన‌వాళ్ల‌కు మ‌తం ఆధారంగా పౌర‌స‌త్వాన్ని ఇవ్వ‌నున్నారు. పైన పేర్కొన్న దేశాల నుంచి 2014కు ముందు భారత్ కు వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది. దీనికి సంబంధించిన బిల్లు 2019 డిసెంబ‌ర్‌ 11న ఆమోదం పొందింది.

ఈ చట్టం ద్వారా ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారికి పెద్ద ఉరటగా చెప్పుకోవచ్చు. పాకిస్థాన్ లో ఇటీవల మైనారిటీలపై దాడులు అధికం అయ్యాయి. ముఖ్యంగా హిందూ స్త్రీలను అపహరించటం, బలవంతంగా పెళ్లి చేసుకోవటం సాధారణంగా మారింది. మతం మారని వారిని వేదిస్తుండంతో మైనారిటీలు పాకిస్తాన్ వదిలి భారత్ తరలివస్తున్నారు. ఈ విధంగా వచ్చిన వారు అధికంగా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్నారు.

జైసల్మేర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్యాంపుల్లో పెద్దసంఖ్యలో పాక్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. దశాబ్దాలుగా ఉన్నా ఓటు హక్కు లేదని, రేషన్ కార్డు లేక ప్రభుత్వ పథకాలు అందటం లేదని వారు వాపోతున్నారు. కూలి నాలి చేసుకొని జీవనం గడుపుతున్న వీరంగా ఒక దశలో తమను పాకిస్తాన్ పంపమని ప్రభుత్వాలను కోరారు.

బంగ్లాదేశ్ లో కూడా ఇటీవల హిందువులపై దాడులు అధికం అయ్యాయి. ఇలాంటి వారికి CAAతో ఉపశమనం లభిస్తుంది. బంగ్లాదేశ్ నుంచి హిందువులతో పాటు ఉపాధి కోసం ముస్లీంలు కూడా పెద్ద సంఖ్యలో సరిహద్దులు దాటి ఈశాన్య రాష్ట్రాల్లో తిష్ట వేశారు. వీరి రాకతో అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో జనాభ లెక్కలే మారాయి. సామాజిక సమతౌల్యం దెబ్బతిని కొన్ని నియోజకవర్గాల్లో వారి ఓట్లే పార్టీలకు కీలకం అయ్యాయి. అక్రమవలసదారులకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పించిందని ఆరోపణలు ఉన్నాయి.

మయన్మార్ లో సైనిక పాలకులు తరుముతుండటంతో రోహింగ్యాలు భారత్ వచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో సంఘవ్యతిరేక శక్తులుగా మారారు. తాజా చట్టంతో వారిని కట్టడి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే విపక్ష పార్టీల నేతలు సీఏఏను త‌మ రాష్ట్రాల్లో అమ‌లు చేయ‌బోమ‌ని పేర్కొన్నారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వటం తగదని విపక్షాలు వాదిస్తున్నాయి. విపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశంలో జనాభా సమతౌల్యం దెబ్బతింటుందని బిజెపి విమర్శిస్తోంది.

శ్రీలంక నుంచి వచ్చిన తమిళ హిందువులకు వర్తింప చేయాలని తమిళనాడు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీలంకలో సింహలుల దాష్టికాలకు 1990ల్లో వేల తమిళ కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారత్ వచ్చాయి. వారంతా తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నా.. పౌరసత్వం లేకపోవటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదు.

370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్, బాబ్రిమసీద్ వివాదం పరిష్కారం తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న NDA ప్రభుత్వం తాజాగా CAA అమల్లోకి తీసుకురావటం జరిగింది. CAA శ్రీలంక శరణార్థులకు వర్తింప చేయకపోవటం… ఈ బిల్లు కొంత అసంపూర్ణంగా ఉన్నా తాజా నిర్ణయంతో దేశ సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో బిజెపికి లబ్ది చేకూరుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్