రవితేజ సినిమా అంటే ఇలా ఉండాలనే కొన్ని కొలమానాలు ఉన్నాయి .. ఆ సినిమా అలాగే ఉండాలి. లేదంటే ఆయన ఫ్లాపు సినిమాల జాబితాలోకి అది కూడా చేరిపోతుంది. రవితేజకి సంబంధించిన ఏ సినిమా ఫంక్షన్ లో నైనా అందరూ ఆయన ఎనర్జీ గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా అని ఫ్లాప్ అయిన సినిమాలలో ఆయన ఎనర్జీ తగ్గిందని అర్థం కాదు. ఆయన ఎనర్జీ లెవెల్స్ కి తగిన కథ పడలేదని అర్థం. అలా ఆయన ఎనర్జీ లెవెల్స్ కి తగిన అవకాశం ఇచ్చిన సినిమాగా ‘ధమాకా‘ గురించి చెప్పుకోవచ్చు
రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన ఈ సినిమాను రూపొందించాడు. క్రితం నెల 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. డే వన్ నుంచి ఈ సినిమా తన జోరును కొనవసాగిస్తూనే వెళుతోంది. ఈ సినిమా విడుదలై నిన్నటితో 14 రోజులైంది. ఈ 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను రాబట్టేసింది. రవితేజతో పాటు ఆయన ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా ఆక్సిజన్ ను ఇచ్చింది.
దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా ‘ధమాకా’కు కలిసొచ్చింది. సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు రవితేజ – శ్రీలీల ఏజ్ గ్యాప్ గురించి చాలామంది మాట్లాడారు. కానీ తెరపై ఎక్కడా ఆ తేడా తెలియకుండా రవితేజ గొప్ప మేజిక్ చేశాడనే చెప్పాలి. త్వరలో ఆయన నుంచి రావడానికి ‘రావణాసుర’ .. ‘టైగర్ నాగేశ్వరరావు’ రెడీ అవుతున్నాయి.