బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో వివాహాల సీజన్‌లోనూ డిమాండ్ తగ్గింది. తులం బంగారం ధర రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి ప్రజలు అటువైపు కన్నెత్తి చూడాలంటేనే దడుసుకున్నారు. అయితే గత మూడు నాలుగు రోజులుగా పసిడి కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. కారణం ఎంటో తెలుసా.. రూ.2 వేల నోట్లను ఆర్బీఐ రద్దుచేయడం. నోట్లను మార్చుకోవాలంటే బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద లైన్లు ఎందుకు కట్టాలనుకున్నారో ఏమో.. ఎప్పటికీ డిమాండ్ ఉండే పసిడిపై పెట్టుబడి పెడుతున్నారు. దీంతో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లోని బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి.
Demonetization: జోరుగా బంగారం కొనుగోళ్ళు
ముంబైలోని జవేరి బజార్‌లో బంగారం కొనుగోలుదారులు రూ.2 వేల నోట్లు చెల్లిస్తున్నారు. గత వారంతో పోలిస్తే 10 గ్రాములకు రూ.485 మేర బంగారం ధర పెరిగింది. అయినప్పటికీ రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రభావం కొనుగోళ్లపై పడలేదు. అయితే బంగారం కొనుగోళ్లు పెద్దగా ఏమీ లేవని ఇండియన్ బులియన్, జువెల్లరీ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో పోలిస్తే కొంతమేరకు రద్దీ తక్కువే ఉన్నట్టు చెప్పారు. అప్పుడు తులం బంగారం ధర రూ.30 వేలు మాత్రమే ఉందని, ప్రస్తుతం అది రూ.60 వేలకు చేరిందన్నారు. బంగారం రేట్లు చుక్కలను అంటడంతో డిమాండ్ కాస్తా తగ్గిందని చెప్పారు. అయితే గతవారంతో పోలిస్తే కొనుగోళ్లు రెట్టింపయ్యాయని తెలిపారు.
ఇక కోల్‌కతాలో నగల కొనుగోళ్లు 15-20 శాతం పెరిగాయన్నారు. 2016 నాటి పరిస్థితులు లేవని, బంగారం దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకుంటున్నారని ఇండియా బులియన్, జువెల్లర్స్ అసోసియేషన్ పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు అశోక్ బెగాని అన్నారు. అయితే రూ.50 వేలు అంతకంటే ఎక్కువ లావాదేవీలకు సంబంధించి వినియోగదారులు కేవైసీ సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని వెల్లడించారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలకు పాన్‌కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని, రూ.10 లక్షల నగదు లావాదేవీలు జరిగినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వానికి సమాచారం అందించాల్సి ఉంటుందని చెప్పారు.