Saturday, September 21, 2024
HomeTrending NewsMancherial: మంచిర్యాలలో ప్రగతి పరుగులు

Mancherial: మంచిర్యాలలో ప్రగతి పరుగులు

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించారు. ఫలితంగా మంచిర్యాల వెనుకబాటుకు గురైంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చిన అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్‌.. తెలంగాణ వస్తే ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి 2016 అక్టోబర్‌ 11న మంచిర్యాలను జిల్లాగా ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది.

జిల్లాకు మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ మంజూరయ్యాయి. నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత మార్కెట్లు.. పార్కు ల ఏర్పాటు, మినీ ట్యాంక్‌ బండ్‌ల సుందరీకరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూ సినా అభివృద్ధి పనులతో మంచిర్యాల జిల్లా మెరిసిపోతున్నది. జిల్లాలో రూ.600 కోట్లతో వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. తొమ్మిదేండ్లలో ఒక్క మంచిర్యాల జిల్లాలోనే వైద్యారోగ్య సేవల కోసం ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా వెచ్చించింది. జిల్లాకు రూ.12 కోట్లతో ప్ర భుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. 100 మంది విద్యార్థులతో 2022-23 అకడమిక్‌ ఇయర్‌కు క్లాసులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఈ ఏడాది రూ.2 కోట్లతో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నారు. జిల్లా పౌరులకు ప్రభుత్వ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు రూ.55.22 కోట్లతో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు.

సాగునీటి పథకాలకు శంకుస్థాపన..

మంచిర్యాల సాగునీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే చెన్నూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సీఎం కేసీఆర్‌ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. చెన్నూర్‌ నియోజకవర్గ ప్రజల కోరికను నెరవేరుస్తూ.. రూ.1658 కోట్లతో 3లిఫ్ట్‌లు, హాజీపూర్‌ మండలం పర్ధాన్‌పల్లిలో రూ.90 కోట్లతో మరో లిఫ్ట్‌ను నిర్మించే పనులను ప్రారంభిస్తారు. చెన్నూర్‌ ఎత్తిపోతల పథ కం ద్వారా 74,270 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 15,730 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడనుంది. చెన్నూర్‌ నియోజకవర్గంలోని 103 గ్రామాల్లో 90 వేల ఎకరాలకు వీటి ద్వారా సాగునీరు అందనుంది. పర్ధాన్‌పల్లి లిఫ్ట్‌తో మంచిర్యాలలో 10 వేల ఎకరాలకు నీరు అందనుంది.

గోదావరిపై మంచిర్యాల-అంతర్గాం మధ్య రూ.164 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.500 కోట్లతో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీకి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతులతో పాటు యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. రైతులు పండించిన ఉత్పత్తులు నిల్వ ఉంచేందుకు రూ.37.50 కోట్లతో మంచిర్యాల, చెన్నూర్‌, లక్సెట్టిపేట, జన్నారం, బెల్లంపల్లిలో గోదాములు నిర్మించారు. జిల్లాలోని 12,68,280 మంది రైతులకు రైతుబంధు కింద రూ.1448.61 కోట్లు జమ చేశారు. మృతి చెందిన 1702 మంది రైతులకు రూ.85.10 కోట్ల రైతుబీమా అందజేశారు.

సంక్షేమ పథకాలతో ఆర్థికాభివృద్ధి

దళితబంధు పథకం కింద తొలి విడతలో మంచిర్యాల జిల్లాలో 313 మందికి తలా రూ.10 లక్షల చొప్పున అందజేశారు. ఈ పథకం జిల్లాలోని దళితుల జీవితాల్లో సరికొత్త మార్పులు తీసుకొచ్చింది. కులవృత్తులకు చేయూతనిచ్చేందుకు జిల్లాలో 100 శాతం రాయితీపై రూ.8.88 కోట్ల విలువైన చేపపిల్లలు, రూ.3.28 కోట్ల విలువైన రొయ్య పిల్లలను పంపిణీ చేశారు. సుమారు 10 వేల మంది మత్స్యకారులు వీటి ద్వారా లబ్ధిపొందారు. పశు వైద్య, సంవర్ధక శాఖ ద్వారా యాదవ, గొల్ల, కుర్మ సామాజిక వర్గానికి చెందిన 7,481 మందికి రూ.93 కోట్లతో గొర్రెలను పంపిణీ చేశారు.

నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

సీఎం కేసీఆర్‌ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి 4.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 4:10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 5 గంటల వరకు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి చేరుకొని 5 :10 గంటలకు ఆ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 5:30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుంటారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. 6:25 గంటలకు కలెక్టరేట్‌ నుంచి బయలుదేరి 6:30 గంటలకు నస్పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7:30 గంటలకు సభను పూర్తి చేసుకొని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రోడ్డు మార్గం ద్వారా రాత్రి 10:30 గంటల వరకు ప్రగతి భవన్‌కు చేరుకుంటారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్