India beat Spain: 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ పై ఇండియా 5-4 తేడాతో విజయం సాధించింది. చివరి నిమిషంలో ఇండియా ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ ద్వారా చేసిన గోల్ తో ఇండియా విజయం ఖరారు చేసుకుంది.
మ్యాచ్ తొలి పావు భాగం 14 వ నిమిషంలో స్పెయిన్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ చేసి బోణీ చేసింది. మరుసటి నిమిషంలోనే హార్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారానే గోల్ సాధించి స్కోరు సమం చేశాడు. రెండో పావు భాగంలో స్పెయిన్ 20, 23వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి తొలి అర్ధ భాగానికి ఇండియాపై 3-1ఆధిక్యం సంపాదించింది, 40వ నిమిషంలో స్పెయిన్ మరో గోల్ చేసి ఆధిక్యాన్ని 4-1కి పెంచుకుంది. అయితే 41,43 నిమిషాల్లో లక్రా శిలానంద్, షంషేర్ సింగ్ లు ఇండియాకు రెండు గోల్స్ సాధించి స్కోరును 3-4 చేశారు.
చివరి పావు భాగంలో 55వ నిమిషం వద్ద వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్ గోల్ సాధించి స్కోరును 4-4తో సమం చేశాడు, ఆట మరి కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా హర్మన్ ప్రీత్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్ తో గోల్ చేసి ఇండియాకు అఊర్వ విజయాన్ని సంపాదించి పెట్టాడు. స్పెయిన్ నాలుగు గోల్స్ సాధిస్తే వాటిలో మూడు గోల్స్ మిరల్లెస్ మార్క్ సాధించాడు.
నేడు ఇదే వేదిక భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో సాయంత్రం జరిగిన ఎఫ్.ఐ.హెచ్. మహిళల ప్రో లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ మహిళా జట్టుపై ఇండియా మహిళలు విజయం సాధించడం విశేషం.
రేపు మళ్ళీ పురుషుల, మహిళల జట్లు స్పెయిన్ తో రెండో మ్యాచ్ ఆడనున్నారు.