సౌతాఫ్రికాలో జరుగుతోన్న అండర్ 19 మహిళల టి 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ను షఫాలీ వర్మ నేతృత్వంలోని ఇండియా జట్టు గెల్చుకుంది. నేడు జరిగిన ఫైనల్లో ఇండియా మహిళా జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి ఐసిసి తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీ టైటిల్ ను సొంతం చేసుకుంది.
సౌతాఫ్రికాలోని పోచెఫ్ స్ట్రూమ్ సెన్వేస్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు చెలరేగి బంతులు విసిరారు, ఒక పరుగు వద్ద ఇంగ్లాండ్ వికెట్ల పతనం మొదలైంది. 17.1 ఓవర్లలో 68 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో టైటాస్ సాధు, అర్చన దేవి, పర్శవి చోప్రా తలా రెండు; మన్నత్ కాశ్యప్, షఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇండియా 16 పరుగులకు తొలి వికెట్ (షఫాలీ వర్మ-15) కోల్పోయింది. శ్వేత షెరావత్ (5) కూడా త్వరగా ఔటయ్యింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష 24 పరుగులతో రాణించింది. సౌమ్య తివారి-24 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.
టైటాస్ సాధు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ గెల్చుకోగా, ‘ప్లేయర్ అఫ్ ద టోర్నమెంట్’ ఇంగ్లాండ్ కెప్టెన్ గ్రేస్ స్క్రీవెన్స్ కు లభించింది.