బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో కూడా 5 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలైంది. లక్ష్య ఛేదనలో మరోసారి తడబాటుకు గురైంది. గాయం కారణంగా చివర్లో బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 3ఫోర్లు, 5సిక్సర్లతో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయం అంచుల వరకూ తీసుకెళ్ళినా ఫలితం లేకపోయింది.
ధాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో బంగ్లా జట్టు 69కే 6వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మహ్ముదుల్లా- మెహిదీ హసన్ మిరాజ్ లు 148 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మహ్ముదుల్లా 77 పరుగులు చేసి ఔట్ కాగా, మిరాజ్ 83 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లతో సరిగ్గా సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 50ఓవర్లలో 7 వికెట్లకు 271పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు; సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ చెరో రెండు వికెట్లు రాబట్టారు.
రోహిత్ కు గాయం కావడంతో శిఖర్ ధావన్ తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించాడు. జట్టు స్కోరు 13కే వీరిద్దరూ (కోహ్లీ-5; శిఖర్-8) పెవిలియన్ చేరారు. వాషింగ్టన్ సుందర్ (11); కెఎల్ రాహుల్ (14) కూడా విఫలమయ్యారు. ఈ స్థితిలో అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్ లు ఐదో వికెట్ కు 107 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. అక్షర్-56, అయ్యర్-82 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో ఇద్దరూ ఔటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన రోహిత్ బ్యాట్ కు పని చెప్పినా విజయం సాధ్యం కాలేదు. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులే చేయగలిగింది.
బంగ్లా బౌలర్లలో ఎబాదత్ హుస్సేన్ 3; హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ చెరో రెండు; ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహ్ముదుల్లా చెరో వికెట్ పడగొట్టారు.
హసన్ మిరాజ్ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.