ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ధాకాలో జరిగిన తొలి మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లా జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత ఇండియా బ్యాటింగ్ లో విఫలమై 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా జట్టు 9 వికెట్లు కోల్పోయి 46 ఓవర్లలో ఛేదించింది.
ఓ దశలో ఇండియా బౌలర్లు బంగ్లా బ్యాట్స్ మెన్ ను కట్టడిచేసి విజయం దిశగా నడిపించారు, కానీ మెహిదీ హాసన్ మిరాజ్(38)-ముస్తాఫిజూర్ రెహ్మాన్(10) లు చివరి వికెట్ కు అనూహ్యంగా 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి గెలిపించారు.
ధాకా షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఇండియా బ్యాటింగ్ కు దిగింది. 23 పరుగులకు ఓపెనర్ ధావన్(7) ఔటయ్యాడు. షకీబ్ అల్ హసన్ ఒకే ఓవర్లో కెప్టెన్ రోహిత్ (27), కోహ్లీ (9)లను ఔట్ చేశాడు. కెఎల్ రాహుల్ ఒక్కడే రాణించి 70 బంతుల్లో 5 ఫోర్లు,4 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్-24; వాషింగ్టన్ సుందర్ -19 స్కోరు చేశారు.
బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ ఐదు, ఎబాదత్ హుస్సేన్ నాలుగు, హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత బంగ్లా మొదటి ఓవర్లోనే పరుగుల ఖాతా మొదలు పెట్టకముందే నజ్ముల్ శాంటో వికెట్ కోల్పోయింది. 128 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లా 8 పరుగుల తేడాతో మరో4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మిరాజ్, ముస్తాఫిజూర్ లు చివరి వికెట్ కోల్పోకుండా క్రీజులో నిలదొక్కుకొని జట్టును విజయం బాట పట్టించారు.
ఇండియా బౌలర్లలో సిరాజ్ మూడు; కుల్దీప్ సేన్, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు; దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
మెహిదీ హసన్ మిరాజ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : India Vs. Australia Hockey: చివరి టెస్టులో ఆసీస్ దే గెలుపు