బర్మింగ్ హామ్ లో జరుగుతోన్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన నేటి మ్యాచ్ లో కెనడాపై 3-2తో అద్భుత విజయం సాధించి మెడల్ రేసులో నిలిచింది.
తొలి మ్యాచ్ లో ఘనా పై 5-0తో, రెండో మ్యాచ్ లో వేల్స్ పై 3-1తో విజయం సాధించిన ఇండియా నిన్న జరిగిన మూడో మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ పై 1-3తేడాతో ఓటమి పాలైంది. కీలకమైన నేటి మ్యాచ్ లో మూడో నిమిషంలోనే ఇండియా తొలి గోల్ పెనాల్టీ కార్నర్ ద్వారా సాధించింది. 22వ నిమిషం వద్ద నవనీత్ కౌర్ ఫీల్డ్ గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు తీసుకెళ్ళింది. ఆ వెంటనే 23వ నిమిషంలో కెనడా తొలి గోల్ సాధించింది, 39వ నిమిషం వద్ద మరో పెనాల్టీ కార్నర్ గోల్ సాధించి స్కోరు 2-2తో సమం చేసింది, ఈ దశలో భారత క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే 51వ నిమిషం వద్ద లాల్ రెమ్సియామి అద్భుతమైన ఫీల్డ్ గోల్ తో ఇండియాకు ఆధిక్యం సంపాదించింది.
ఆ తర్వాత గోల్స్ కోసం కెనడా ప్లేయర్లు చేసిన ప్రయత్నాలను ఇండియా ప్లేయర్లు గట్టిగా అడ్డుకున్నారు. దీనితో ఇండియా కు విజయం సొంతమైంది.
Also Read : CWG-2022: ఇండియాకు రజతం