కామన్ వెల్త్ గేమ్స్ లో మనదేశం నుంచి పాల్గొంటున్న ఆటగాళ్లకు ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ) ఓ సూచన చేసింది. కోవిడ్-19 దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉండొద్దని కోరింది. కోవిడ్ మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ సేపు బైట గడిపితే ఆ వైరస్ బారిన పడే ప్రమాదముందని, ఇది ఆటగాళ్ళను ఈవెంట్ నుంచి దూరం చేయడమే కాక, సహచర ఆటగాళ్ళ మానసిక స్థయిర్యాన్ని కూడా దెబ్బతీస్తుందని ఓ ప్రకటన ద్వారా ఆటగాళ్లకు తెలియజేసింది.
ఎల్లుండి జూలై 28 నుంచి లండన్ లోని బర్మింగ్ హాం లో మొదలు కానున్న ఈ క్రీడల్లో మన దేశం తరఫున 215 మంది ఆటగాళ్ళు పాల్గొంటున్నారు. మొత్తం 19 క్రీడంశాల్లోని 141 విభాగాల్లో వారు తమ సత్తా ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 8న ఈ క్రీడలు ముగుస్తాయి.