Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం : ఐఓఏ

అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం : ఐఓఏ

టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బృందం మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) గురువారం స్పష్టం చేసింది. ఇప్పటికే అందరూ తమ మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మరికొందరు రెండు డోసులూ వేయించుకున్నారని  తెలియజేసింది.

భారత దేశం తరఫున ఆడుతున్న అథ్లెట్లు, సాంకేతిక సిబ్బంది, డెలిగేట్లు అందరూ కోవిడ్ నిబధనలకు కట్టుబడి ఉంటారని, ముందు జాగ్రత్తలు తీసుకుంటారని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘానికి (ఐఓసి), టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీకి హామీ ఇచ్చింది. జపాన్ బయలుదేరడానికి ముందే అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేస్తామని పేర్కొంది.

ఒలింపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్ళ భద్రత, వ్యాక్సిన్ పై భారత ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు ఐఓఏ కృతజ్ఞతలు తెలియజేసింది.  మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందంలోని ప్రతి సభ్యుడి భద్రతకు కట్టుబడి ఉన్నామని, వారు విమానం ఎక్కడానికి ముందే కోవిడ్ నిబంధనలన్నీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ రెండోదశ దృష్టిలో ఉంచుకొని ఒలింపిక్స్ నిర్వహణ సాఫీగా, సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఐఓసి, టోక్యో కమిటికి  కృతజ్ఞతలు తెలిపింది ఐఓఏ.  ఈ విషయంలో తమ పూర్తి  సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.  ఈ విశ్వక్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, సిబ్బందితో పాటు జపాన్ ప్రజల భద్రత కూడా ముఖ్యమేనని ఐఓఏ అభిప్రాయపడింది.

జూలై 23 న ప్రారంభమయ్యే ఈ క్రీడా సంబరాలు ఆగస్ట్ 8న ముగుస్తాయి. గత ఏడాదే నిర్వహించాల్సి ఉండగా  కోవిడ్ నేపధ్యంలో వాయిదా పడ్డాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్